క‌ర‌ణంపై వైసీపీలో డౌట్ కొడుతోందే.. రీజ‌నేంటి..?

-

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు, అంతేకాదు… రాజ‌కీయ నాడి తెలిసిన మేధావిగా ప్ర‌కాశం జిల్లాలో చెప్పు కొంటారు. దాదాపు న‌లభై ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారు. ప‌లుమార్లు ప్ర‌జాక్షేత్రంలో విజ‌యం సాధించారు. టీడీపీలో కీల‌క నేత‌గా ఎదిగారు. అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చీరాల నుంచి విజ‌యం సాధించిన త‌ర్వాత టీడీపీని వీడి.. వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారారు. వాస్త‌వానికి ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేగానే రికార్డుల ప్ర‌కారం సాగుతున్నారు.కానీ.. వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారారు. అంతేకాదు.. త‌న కుమారుడు వెంక‌టేష్‌కు ఎక్క‌డో ఒక‌చోట సీటు ఇప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంటే.. మొత్తంగా టీడీపీ క‌న్నా.. వైసీపీ బాగుంద‌నే క‌ర‌ణం భావిస్తున్నార‌ని అనుకోవాలి.!

ఇది పైకి క‌నిపిస్తున్న ప‌రిస్థితి. కానీ, క‌ర‌ణం అడుగులు, ఆయ‌న వ్య‌వ‌హారం.. అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తులు చూస్తే.. మాత్రం టీడీపీపై ఆయ‌న‌కు ఎక్క‌డా ప్రేమ త‌గ్గ‌లేద‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీలో ఏదో బ‌లవంతంగా ఉంటున్నారని కూడా వీరు అంటున్నారు. దీనికి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు. వైసీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డి పార్టీ నేత‌ల‌తో ఆయ‌న క‌లివిడిగా తిర‌గాలి. కానీ, ఎక్క‌డా ఆ ఊసేలేదు. పైగా.. ఎక్క‌డిక‌క్క‌డ గొడ‌వ‌లు పెట్టుకుంటున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన గొడ‌వ‌ల్లో చీరాల ప్ర‌జ‌లు సైతం తాము క‌ర‌ణంను అన‌వ‌స‌రంగా గెలిపించామని ఫైర్ అవుతోన్న వీడియోలు ఓ రేంజ్‌లో వైర‌ల్ అయ్యాయి.

ఇక‌, టీడీపీలో ఉండ‌గా.. కీల‌క నేత‌ల‌కు వాట్సాప్ గ్రూపు ఉంది. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు (వైసీపీకి మ‌ద్ద‌తుగా మారిన త‌ర్వాత కూడా) క‌ర‌ణం.. టీడీపీ గ్రూపులోనే కొన‌సాగారు. ఇక‌, వైసీపీలోకి వ‌చ్చినా.. టీడీపీపై ప‌న్నెత్తు విమ‌ర్శ చేయ‌డం లేదు. పైగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయాల్సిన స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు దూకుడుగా ఉంటున్నారు. ఆమంచి చంద్ర‌బాబును చీల్చి చెండాడుతున్నారు. ఇవ‌న్నీ ఒక ప‌క్క‌న పెడితే.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు అంద‌రూ కూడా .. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజును ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. భారీ ఎత్తున క‌టౌట్లు పెట్టి మ‌రీ.. త‌మ పేరు జ‌గ‌న్‌కు వినిపించేలా.. త‌మ వాయిస్.. ప్ర‌ధాన మీడియాలో వినిపించేలా.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

జ‌గ‌న్ బ‌ర్త్ డే కోసం ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరాలు రికార్డు క్రియేట్ చేయ‌గా.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన హంగామా అంతా ఇంతా కాదు. మ‌రి ఈ క్ర‌మంలో చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే, పైగా త‌న కుమారుడికి మంచి లైఫ్ కోసం.. వైసీపీలోకి వ‌చ్చిన క‌ర‌ణం మాత్రం.. జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌ను నామ్‌కే వాస్తే.. అన్న‌ట్టుగా తూతూ మంత్రం చేసేశారు. అది కూడా బాప‌ట్ల‌లో గ‌తంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ‌రికూటి అమృత‌పాణి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల‌కు బ‌ల‌రాం రాక‌పోగా వెంక‌టేష్ రాగా నామ్ కే వాస్తేగా వీటిని ముగించేశారు. అదే స‌మ‌యంలో ఆమంచి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మం అంతా ధూమ్ ధామ్‌గా జ‌రిగింది.

గ‌తంలో బ‌ల‌రాం పుట్టిన రోజు సంద‌ర్భంగా చీరాల‌లో జ‌రిగిన హంగామా అంతా ఇంతా కాదు. చీరాల ప‌ట్ట‌ణం అంతా బ‌ల‌రాం ఫ్లెక్సీల‌తో నిండిపోయింది. ఇంత‌కు ముందు వైఎస్సార్ వ‌ర్థంతి వేడుక‌ల్లోనూ క‌ర‌ణం వ‌ర్గం చురుగ్గాపాల్గొంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంఘీభావంగా నాడు – నేడు కార్య‌క్ర‌మాల‌ను బాగా నిర్వ‌హించింది. అలాంటిది ఇప్పుడు పార్టీ అధినేత‌, సాక్షాత్తు ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌ల‌రాం వ‌ర్గం ఫ్లెక్సీలు వేయించ‌క‌పోవ‌డం పార్టీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో బ‌ల‌రాం వైసీపీలోనే ఉన్నా ఆయ‌న‌పై ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని జిల్లా వైసీపీ కీల‌క నేత‌ల్లో కూడా స‌రికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అస‌లు బ‌ల‌రాంకు వైసీపీపై ప్రేమ ఉందా ?  లేక  కాంట్రాక్టులు, వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు.. చూసుకునేందుకు, చేసుకునేందుకే పార్టీకి చేరువ అయ్యారా ?  లేక కేసుల నుంచి ర‌క్షించుకునేందుకు క‌ర‌ణం వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారారా?“ అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి దీనికి క‌ర‌ణం ఏం చెబుతారో చూడాలి. ఏదేమైనా.. మ‌న‌సు టీడీపీలో, మ‌నిషి వైసీపీలో ఉన్నార‌ని అంటున్న‌.. క‌ర‌ణం వ‌ర్గం మాటే నిజ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version