ఈ మధ్య ఏపీలో హాట్ టాఫిక్ గా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వివాదానికి వైసీపీ చెక్ పెట్టే దిశగా ఎట్టకేలకు అడుగులు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఆయన పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కొన్ని రోజుల క్రితం వైసీపీ కార్యకర్తలు రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసన తెలిపారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే.