శుభవార్త: ముద్ర లోన్ వడ్డీపై సబ్సిడీ..!

-

కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు తీసుకున్న వారికి శుభవార్త చెప్పింది. ఈ పథకంలో భాగంగా శిశు యోజన కింద రూ.50వేల కన్నా తక్కువ రుణం పొందిన వారికి వడ్డీపై 2 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయానికి బుధవారం ఆమోదముద్ర వేసింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మాట్లాడుతూ.. తాము అందిస్తున్న ఈ సబ్సిడీ వల్ల 9.37 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు కలుగుతుందన్నారు. ఇందుకు గాను కేంద్రం రూ.1540 కోట్లను ఖర్చు చేస్తుందని తెలిపారు. జూన్‌ 1, 2020 నుంచి మే 31, 2021 వరకు ఈ సబ్సిడీ అందిస్తామని తెలిపారు.

కాగా దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, ఔత్సాహికులకు లబ్ధి చేకూర్చడం కోసం మైక్రో యూనిట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీఫైనాన్స్‌ ఏజెన్సీ (ముద్ర) పథకాన్ని అప్పట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 20 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా కేంద్రం సహకారంతో ఆర్థిక సంస్థలు లబ్ధిదారులకు వ్యాపారం చేసుకునేందుకు రుణాలను ఇస్తాయి. రూ.50వేలు అంతకన్నా తక్కువ రుణం కావలిస్తే శిశు యోజన కింద ముద్ర పథకంలో భాగంగా రుణం ఇస్తారు. అదే రూ.50వేల పైన, రూ.5 లక్షల వరకు అయితే కిశోర్‌ యోజన కింద, రూ.5 లక్షల పైన, రూ.10 లక్షల లోపు అయితే తరుణ్‌ యోజన కింద రుణాలను ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version