రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిన్న తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. శాసనమండలిలో టీడీపీకి సంఖ్యాబలం ఉండటం వలన రాజ్యాంగపరమైన స్ఫూర్తిని వదిలేసి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకోవాలనో లేక జాప్యం చేయాలనో ప్రయత్నించడం చాలా దురదృష్టకరమైన పరిణామం అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. మండలిలో జరిగిన పరిణామాలు ప్రజస్వామానికి ఆందోళన కలిగిస్తున్నాయని.. చాలా రాష్ట్రాల్లో మండలి లేదని ఆయన తెలిపారు.
మండలిలో మెజార్టీ ఉంటే బిల్లులను తిరిగి పంపవచ్చని.. కానీ అలా కాకుండా బిల్లులను అడ్డుకున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా అడ్డుకునే కార్యక్రమాన్ని శాసనమండలి అజెండాగా టీడీపీ తీసుకుందని అంబటి విమర్శించారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి అని, అభివృద్ధి నిరోధక శక్తిగా శాసనమండలిని తయారు చేయాలని టీడీపీ భావించడం దురదృష్టకర పరిణామం అని మండిపడ్డారు. అలాంటి శాసనమండలి అవసరమా? అనే విషయాన్ని ప్రజలు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు.