ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన, కమిటి నివేదిక ఇప్పుడు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారాయి. రాజకీయంగా పక్కన పెడితే ప్రజల్లో ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా ఇప్పుడు వినపడుతున్నాయి. జగన్ నిర్ణయాన్ని సమర్ధించిన వారి సంఖ్య కంటే ఆయనను వద్దనే వారే ఎక్కువయ్యారు అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా ఇప్పుడు ఇది ఇబ్బందిగా మారింది. ప్రధానంగా రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు గా ఉన్న, ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు ప్రభుత్వ ప్రకటనను, కమిటి నివేదికను తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో నిరసనలు జరుగుతున్నాయి. కాని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం బయటకు వచ్చి తమ అభిప్రాయం ఏంటీ అనేది గాని 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల సమస్యలు వినడం గాని దాదాపుగా చేయలేదు.
రాజధాని ప్రాంత స్థానిక వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు భయం భయంగా ఉన్నారని అంటున్నారు. సమాధానం చెప్పలేక జగన్ కు ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వైసీపీ కార్యకర్తలు వారిపై విమర్శలు చేస్తున్నారు. ఇక స్థానిక నేతలు కొందరు పార్టీకి రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా జగన్ ప్రకటనతో వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.