ప్రకాశం జిల్లాలో కీలక నేతగా మారిన టీడీపీ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను వైసీపీ టార్గెట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ మారాలని వైసీపీ శ్రేణులు ఏకంగా హుకూం జారీ చేస్తున్నారని సమాచారం. గత కొద్దికాలంగా ఆయన క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఏదో కేసులో ఇరికించడం, ఆస్తులు సీజ్, వ్యాపారాలను మూసివేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు ఆరంభించారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మారితే ఇన్ని కష్టాలు ఉండవు కదా రవిగారు అంటూ వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో ఆయనకు సూచిస్తున్నారట.
దీంతో పార్టీని వీడలేక..వైసీపీలోకి వెళ్లడం ఇష్టం లేక అద్దంకి ఎమ్మెల్యే అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారట. ఇక వైసీపీ తనపై కక్ష గట్టిందని తన వ్యాపారాలపై దాడులు చేయిస్తోందని ఇటీవల అమరావతికి వెళ్లిన రవికుమార్ చంద్రబాబుకు తన గోడును వెళ్లబోసుకున్నారట. అయితే ఏమాత్రం అధైర్యపడోద్దని, అవసరమైతే న్యాయపరంగా వారిని ఢీకొనేందుకు సిద్ధంగా ఉండాలని మనోధైర్యం చెప్పారట. అయితే రవికుమార్‌కు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న రెండు క్వారీలను సీజ్ చేసినట్లు సమాచారం.
పోని వైసీపీలోకి వెళ్దామని నిర్ణయానికి వచ్చినా పార్టీ నియోజకవర్గ పదవి మాత్రం ఇవ్వడానికి ఆ పార్టీ అధిష్ఠానం ఇష్టపడకపోవడంతో ఇప్పుడు అసలు ఏం చేయాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారట. ఏదైనా నిర్ణయం త్వరగా తొందరగా తీసుకోవాలని వైసీపీ నుంచి ఒత్తిడి వస్తుండగా…ఆయన అనుచరులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై అటో ఇటో తేల్చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో రవికుమార్ కీలక నేతగా ఎదిగారు.
2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవికుమార్, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ టిడిపిలో చేరడంతో వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి గెలిచారు. అయితే మళ్లీ జగన్ గూటికి ఆయన చేరిపోవడం ఖాయమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.