ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి మరో మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అప్పుడే ఈ ఉప ఎన్నికకు చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించేశారు. అవుట్ డేటెడ్ లీడర్ అయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును బాబు అప్పుడే ప్రకటించేశారు. వాస్తవానికి అభ్యర్థుల ఎంపికలో ఎప్పుడూ వెనకాల ఉండే బాబు ఈ సారి ఇంత ముందుగా అభ్యర్థిని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఇదే షాక్ అనుకుంటే ఈ ఉప ఎన్నిక కోసం ఏకంగా 97 మందితో ఓ జంబో కమిటీ కూడా వేశారు.
ఇటీవల బాబు నియమించిన పార్టీ కమిటీల నేతల్లో చాలా మందిని ఈ ఉప ఎన్నికకు ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులుగా నియమించారు. ఈ జంబో కమిటీ చూసిన జనాలే కాదు.. పార్టీ నేతలు కూడా నవ్వుకుంటున్నారు. బాబు ఎంత చేసినా ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అయితే ఖచ్ఛితంగా గెలవదనే చెప్పాలి. అసలు ఇక్కడ టీడీపీ ఆవిర్భవించిన 1984 ఎన్నికల్లో తప్పా ఎప్పుడూ గెలవలేదు. అంటే 38 ఏళ్ల క్రితమే అక్కడ టీడీపీకి చివరి గెలుపు. దీనిని బట్టి ఈ పార్లమెంటు పరిధిలో టీడీపీ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది.
అసలు తిరుపతి ఎంపీ సీటు విషయంలో టీడీపీకి ఎప్పుడూ బలమైన అభ్యర్థి దొరకడం లేదు. 2009లో కృష్ణా జిల్లాకు చెందిన వర్ల రామయ్యను పోటీ చేయించగా ఆయన ఓడిపోయారు. ఇక 2014లో ఈ సీటు బీజేపీకి ఇచ్చిచేతులు దులుపుకున్నారు. 1999, 2004లోనూ బాబు ఈ సీటును బీజేపీకి వదిలేశారు. దీనిని బట్టి ఇక్కడ పార్టీకి బలం లేదని అర్థమవుతోంది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ కోటాలో అప్పటికప్పుడు పార్టీ మారిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పోటీ చేయిస్తే ఆమె ఏకంగా 2.28 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అసలు జనాల్లోనే లేని ఆమెకే తిరిగి సీటు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో పార్టీ వాళ్లకే అర్థం కావడం లేదు. వాస్తవానికి బాబు ఈ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయాలనుకున్నారు. అయితే బీజేపీ బాబుతో కలిసేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. దీంతో తెరవెనక లాలూచీ రాజకీయాల్లో భాగంగా బలహీనమైన క్యాండెట్ అయిన పనబాకను పోటీలో పెట్టి తెరవెనక బీజేపీ క్యాండెట్‌కు సపోర్ట్ చేయించే ప్లాన్‌లోనే ఈ కామెడీ రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బాబు ఎంత లాలూచీ రాజకీయాలు చేసినా.. మెజార్టీ కాస్త అటూ ఇటూ అవ్వొచ్చేమో గాని తిరుపతిలో వైసీపీ గెలుపు పక్కా..!