వ‌ర‌ల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌.. 4 బంతుల్లో 4 సిక్స‌ర్లు కొట్టిన యువీ.. వీడియో..!

-

గ‌తంలో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో యువ‌రాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి చ‌రిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ 6 సిక్స్‌లు బాదాడు. అయితే స‌రిగ్గా అలాగే మ‌రోసారి యువీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. వ‌ర‌ల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో యువీ మ‌రో సారి రెచ్చిపోయాడు. 4 బంతుల్లో వ‌రుస‌గా 4 సిక్స‌ర్లు బాదాడు.

yuvraj singh hit 4 sixers in a row video

వ‌ర‌ల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్‌లో ఇండియా లెజెండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో కెప్టెన్ టెండుల్క‌ర్‌తోపాటు యువ‌రాజ్ సింగ్‌లు విరుచుకు ప‌డ్డారు. 37 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో స‌చిన్ 60 ప‌రుగులు చేయ‌గా, యువీ 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఇండియా లెజెండ్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

అయితే భార‌త్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌల‌ర్ జాండ‌ర్ డి బ్రుయిన్ బౌలింగ్‌లో 18వ ఓవ‌ర్‌లో యువీ వ‌రుస‌గా మొద‌టి నాలుగు బంతుల్లో 4 సిక్స‌ర్లు కొట్టాడు. దీంతో భార‌త్ భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్‌పై ఇండియా లెజెండ్స్ జ‌ట్టు 56 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే యువీ ఈ మ్యాచ్‌లో అలా రెచ్చిపోవ‌డంపై అభిమానులు సంతోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారు. అప్ప‌ట్లో అత‌ను ఇంగ్లండ్‌పై బాదిన 6 సిక్స‌ర్ల‌ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక యువీ సిక్స‌ర్ల వీడియో తాజాగా వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news