గ్రీకు దేశం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆ దేశానికి చెందిన పురాతన శాస్త్రవేత్తలే. ఎంతో మంది ఎన్నో రంగాల్లో అద్భుతమైన విషయాలను కనుగొని ప్రపంచ మానవాళికి వాటిని తెలియజేశారు. ఇక ఖగోళ శాస్త్రానికి సంబంధించి గ్రీకు శాస్త్రవేత్తలు అద్భుతమైన విషయాలను కనుగొన్నారు. పలు రహస్యాలను ఛేదించారు. వాటిలో ముఖ్యమైన 4 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
1. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి
క్రీస్తు పూర్వం 310 బీసీ నుంచి 230 బీసీ వరకు అరిస్టార్కస్ సామోస్ అనే శాస్త్రవేత్త సూర్యుడు ఒక కేంద్రం మధ్యలో ఉన్నాడని.. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయని చెప్పాడు. మన సౌరవ్యవస్థకు సంబంధించి మొదటగా తెలిసిన విషయంగా ఈ సిద్ధాంతం గుర్తింపు పొందింది. అయితే దీనికి సంబంధించి చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలూ ఎవరికీ లభ్యం కాలేదు. ఇక అరిస్టార్కస్ భూమి, చంద్రుడి కన్నా సూర్యుడు పెద్దగా ఉంటాడని అంచనా వేశాడు. అయితే 16వ శతాబ్దంలో నికోలాస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త అరిస్టార్కస్ చెప్పిన విషయాన్ని ధ్రువీకరించాడు.
2. చంద్రుని సైజ్
అరిస్టార్కస్ రాసిన అనేక పుస్తకాలు మనకు ఇంకా లభ్యం కాలేదు. కానీ ఒక్క పుస్తకం మాత్రం దొరికిందని తెలిసింది. అందులో సూర్యుడు, చంద్రుడి మధ్య ఎంత దూరం ఉంటుంది, ఆయా గ్రహాల పరిమాణాలు ఎంత.. అనే వివరాలను అరిస్టార్కస్ చెప్పాడని సమాచారం. ఇక అప్పట్లో సూర్యగ్రహణాల వల్ల చంద్రుడు, సూర్యుడు ఒకే సైజులో ఉంటారని.. అందరూ భావించేవారని కూడా.. అరిస్టార్కస్ తన పుస్తకాల్లో రాసినట్లు సమాచారం. అలాగే భూమి నుంచి చంద్రుని మధ్య ఉండే దూరానికి 18 నుంచి 20 రెట్లు ఎక్కువ దూరంలో సూర్యుడు ఉంటాడని, భూమి పరిమాణంలో చంద్రుడు 1/3వ వంతు ఉంటాడని కూడా అరిస్టార్కస్ చెప్పాడు. తరువాతి కాలంలో పైథాగరస్ అనే మరో శాస్త్రవేత్త ఇదే విషయంపై పరిశోధన చేసి త్రిభుజ ధర్మాలను సిద్ధాంతీకరించాడు.
3. భూమి చుట్టుకొలత
క్రీస్తు పూర్వం 276 బీసీ నుంచి 195 బీసీ వరకు ఉన్న కాలంలో ఎరాటోస్థనీస్ అనే శాస్త్రవేత్త అప్పటి గ్రీకు పట్టణం అలెగ్జాండ్రియాలోని గ్రేట్ లైబ్రరీలో చీఫ్ లైబ్రేరియన్‌గా పనిచేసేవాడు. అయితే భూమి చుట్టు కొలతను పలు సిద్ధాంతాల సహాయంతో ఆయన అప్పట్లోనే దాదాపుగా కచ్చితంగా అంచనా వేసి చెప్పాడు. భూమి చుట్టు కొలత దాదాపుగా 40వేల కిలోమీటర్లు ఉంటుందని చెప్పాడు. తరువాత 135 బీసీ నుంచి 51 బీసీ మధ్య కాలంలో పోసిడోనియస్ అనే మరో శాస్త్రవేత్త భిన్నరకాల పద్ధతుల్లో భూమి చుట్టు కొలతను కొలిచే ప్రయత్నం చేయగా.. అదే సమాధానం వచ్చింది. ఇక ఆధునిక పద్ధతుల్లో సైంటిస్టులు చేసిన ప్రయోగాలకు భూమి చుట్టు కొలత సమాధానం.. 40,075 కిలోమీటర్లు అని రావడం విశేషం.
4. మొదటి ఖగోళ కాలిక్యులేటర్
ప్రపంచంలోని మొదటి ఖగోళ (Astronomical) కాలిక్యులేటర్‌ను తయారు చేసిన ఘనత కూడా గ్రీకులదే అని చెప్పవచ్చు. 1900వ సంవత్సరంలో గ్రీక్ దేశంలోని యాంటీకైథెరా అనే ఓ ద్వీపంలో ఆ కాలిక్యులేటర్ బయట పడింది. సముద్రంలో కుంగిపోయిన ఓ పాడుబడిన ఓడలో నుంచి దాన్ని వెలికితీశారు. ఆ యంత్రం పెద్ద పెద్ద ఇరుసులు, చక్రాలతో ఉంటుంది. కానీ అది ఇప్పుడు పగిలిపోయింది. అయితే ఆ కాలిక్యులేటర్ గ్రహ గమనాలు, గ్రహణాలు, సౌర వ్యవస్థలో గ్రహాలు ఉండే స్థానాలు తదితర విషయాలను తెలియజేస్తుంది. ఇక దాన్ని క్రీస్తు పూర్వం 3 నుంచి 1 శతాబ్ధాల మధ్య ఆర్కిమెడిస్ అనే గ్రీకు గణిత శాస్త్రవేత్త తయారు చేశాడని చెబుతారు.