కరోనా నేపథ్యంలో సైంటిస్టులు ఇప్పటికే అనేక విషయాలను మనకు తెలియజేశారు. డయాబెటిస్, అధిక బరువు సమస్యలు ఉన్నవారు కోవిడ్ బారిన పడితే తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే కంటి సమస్యలు ఉన్నవారు కూడా కోవిడ్ బారిన పడితే పరిస్థితి తీవ్రతరం అవుతుందని తాజాగా చేపట్టిన అధ్యయనంలో వెల్లడించారు.
యూకేలోని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకులు పైన తెలిపిన అధ్యయనం చేపట్టారు. మొత్తం 187 మంది కోవిడ్ పేషెంట్లను వారు పరిశీలించారు. వారందరూ డయాబెటిస్‌తో బాధపడుతుండగా కోవిడ్ సోకింది. అయితే వారిలో 179 మందికి టైప్ 2 డయాబెటిస్ ఉండగా, మరో 8 మందికి టైప్ 1 డయాబెటిస్ ఉంది. ఇక వారిలో 67 మందికి డయాబెటిక్ రెటినోపతి సమస్య ఉంది. అంటే డయాబెటిస్ ఉన్నవారికి వచ్చే కంటి సమస్య. అయితే ఈ సమస్య ఉన్నవారికి కోవిడ్ వల్ల ఇన్‌ఫెక్షన్ 5 రెట్లు పెరిగిందని తేల్చారు.
అందువల్ల కంటి సమస్యలు ఉన్నవారు కూడా కోవిడ్ బారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. కంటి సమస్యలు ఉన్నవారు వాటి నుంచి బయట పడే లేదా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలంటున్నారు. కాగా డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి కోవిడ్ సోకితే వారి పరిస్థితి తీవ్రతరం అవుతుందని గతంలోనే సైంటిస్టులు చెప్పగా.. ఇప్పుడీ విషయాన్ని కొత్తగా వెల్లడించడంతో జనాలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.