ఈ నెలలో ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. పౌర్ణమి వేళ ఈసారి దర్శనమిచ్చే పూర్ణ చంద్రుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి ఏర్పడే పూర్ణ చంద్రుడిని ‘పింక్ మూన్’ అని పిలుస్తారట. మన దేశ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:19 గంటలకు పింక్ మూన్‌ను మనం చూడొచ్చు. మన దేశంలోని ఔత్సాహికులు ఒకవేళ ఈ అద్బుత దృశ్యాన్ని చూడాలని భావిస్తే బుధవారం ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది.
ఉదయం 5:19 గంటలకు చంద్రాస్తమయం మొదలవుతుంది. ఆ సమయంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోతున్న సంపూర్ణ చంద్రుడిని చూడొచ్చు. పింక్ మూన్ ఈసారి స్పైకా నక్షత్రం దగ్గరగా ఉన్న కన్య రాశిలో కనిపిస్తుందని నాసా అంచనా వేస్తోంది. సోమ, అత్యంత ప్రకాశవంతమైన సంపూర్ణ చంద్రుడిని చూడాలంటే మాత్రం మంగళవారమే(అమెరికా కాలమానం ప్రకారం) ఉత్తమ సమయం అని నాసా పేర్కొంది. మన దేశంలో పింక్ మూన్‌ను హనుమంతుని పవిత్రమైన జన్మదిన వేడుకతో ముడిపెట్టి చూస్తారు.