ఈరోజు ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. పౌర్ణమి వేళ ఈసారి దర్శనమిచ్చే పూర్ణ చంద్రుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి ఏర్పడే పూర్ణ చంద్రుడిని ‘పింక్ మూన్’ అని పిలుస్తారు. మన దేశ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 5:19 గంటలకు పింక్ మూన్‌ను చూడొచ్చు. అమెరికా, కెనడా సహా ఇతర తూర్పు దేశాల్లోనైతే మంగళవారం సాయంత్రం 7:49 గంటలకు పింక్ మూన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈరోజు ఉదయం 5:19 గంటలకు చంద్రాస్తమయం జరగడం మొదలయింది. ఈ సమయంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోతున్న సంపూర్ణ చంద్రుడిని మనం చూడొచ్చు. అదే సమయంలో ఆకాశంలో లిరిడ్ ఉల్కాపాతం కూడా సంభవిస్తుంది. అంటే ఉల్కలు రాలడం కూడా మనకు కనిపిస్తుంది. మన దేశంలో పింక్ మూన్‌ను హనుమంతుని పవిత్రమైన జన్మదిన వేడుకతో ముడిపెట్టి చూస్తారు. శ్రీలంక ప్రజలు ‘బక్ పోయా’ పండుగతో ఈ ఫుల్‌మూన్‌కు సంబంధం ఉందని భావిస్తుంటారు.