నేటి టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్ కు ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెల్సిందే. ఒక్క నిమిషం పాటు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగితే ఎవరూ ఉండలేకపోతున్నారు. ఇంటర్నెట్ వేగం మందగించినా చిరాకు పడుతుంటారు. అయితే ఆ ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచేలా త్వరలో భారత దేశంలో 5జీ టెక్నాలజీ (5G Technology ) అందుబాటులోకి రాబోతుంది. అయితే 5జీ టెక్నాలజీపై పలువురు పర్యావరణవేత్తలు నుంచి విమర్శలు వస్తున్నాయి. 5జీ టెక్నాలజీ సమస్త జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే 5జీ టెక్నాలజీపై ఎలాంటి అపోహలు వద్దని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఐఏ) తెలిపింది. తే, 5జీ టెక్నాలజీ ఎవరి ఆరోగ్యం పైనా ప్రభావం చూపదని వివరణ ఇచ్చింది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రతిసారీ ఇలాంటి అసత్య ప్రచారాలు జరుగుతూనే ఉంటాయని సీఓఐఏ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ అన్నారు. 5జీ టెక్నాలజీ పూర్తి సురక్షితమని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని సీఓఐఏ వివరించింది. రానున్న కాలంలో 5జీ టెక్నాలజీ అత్యంత కీలకంగా మారబోతుందని, దీని వల్ల తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి విస్తృతమైన ప్రయోజనాలు కలుగుతాయని తెలిపింది.
టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికే 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా, తక్కువ రేడియేషన్తో ఈ 5జీ సేవలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా 5జీ విషయంలో అంతర్జాతీయంగా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ ప్రమాణాలతో పోలిస్తే పదో వంతు మాత్రమే ఉండేలా కేంద్రం నిబంధనలు విధించింది.