గూగుల్ ప్లే స్టోర్‌లో యూజర్లకు అందుబాటులో ఉన్న యాప్‌లలో ఎప్పుడూ ఏవో కొన్ని యాప్స్ హానికరమని తెలుస్తూనే ఉంది. దీంతో గూగుల్ ఎప్పటికప్పుడు అలాంటి యాప్స్‌ను తొలగిస్తూ వస్తోంది. అయినప్పటికీ హానికర యాప్స్ ఇంకా ప్లే స్టోర్‌లో అలాగే ఉన్నాయి. అలాంటి యాప్‌లలో గో ఎస్ఎంఎస్ ప్రొ కూడా ఒకటి. ఇది పాపులర్ టెక్ట్స్ యాప్‌గా పేరుగాంచింది. 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ యాప్ ను ఉపయోగించిన యూజర్ల డేటా మొత్తాన్ని పబ్లిగ్గా యాక్సెస్ చేయవచ్చని సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.
గో ఎస్ఎంఎస్ ప్రొ యాప్ ద్వారా యూజర్లు పంపుకున్న సమస్త సమాచారాన్ని ఒక యూఆర్ఎల్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చని నిపుణులు గుర్తించారు. అందులో యూజర్లు టెక్ట్స్ సందేశాలతోపాటు ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ పంపుకున్నారని, అలాగే బ్యాంకింగ్ వంటి సున్నితమైన సమాచారానికి చెందిన వివరాలను కూడా పంపుకున్నారని.. ఆ మొత్తం డేటా ఇప్పుడు పబ్లిగ్గా ఎవరికైనా లభిస్తుందని వెల్లడైంది. అందువల్ల ఆ యాప్‌ను వాడుతున్న వారు వెంటనే దాన్ని డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఆ విషయంపై సదరు యాప్ డెవలపర్లకు ఆగస్టులోనే చెప్పినా ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి స్పందనా లేదని, అందుకనే ఈ విషయాన్ని ఇప్పుడు యూజర్లకు చెప్పక తప్పడం లేదని సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రస్ట్ వేవ్ వెల్లడించింది. సదరు యాప్‌లో ఇప్పటి వరకు యూజర్లు పంపుకున్న సమాచారం పట్ల ఇప్పటికైతే ఏమీ చేయలేమని, అది ఆల్రెడీ పబ్లిగ్గా లభిస్తుందని, కానీ ఇప్పటికైనా ఆ యాప్‌ను ఫోన్ల నుంచి తొలగించాలని వారు సూచిస్తున్నారు.