క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌రో ఏడాది వ‌ర‌కు మైక్రోసాఫ్ట్ ఈవెంట్ల‌న్నీ ఆన్‌లైన్‌లోనే..!

-

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల ఫిబ్ర‌వ‌రి నుంచి మే నెల వ‌ర‌కు జ‌ర‌గాల్సిన ప‌లు ఐటీ కంపెనీల ఈవెంట్లు, ప‌లు అంత‌ర్జాతీయ స‌ద‌స్సులు స‌మావేశాలు ఇప్ప‌టికే ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే. ఇక ప‌లు స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీలు తాము విడుద‌ల చేయాల్సిన కొత్త స్మార్ట్‌ఫోన్ల‌ను ఆన్‌లైన్‌లోనే లాంచ్ చేశాయి. కాగా మైక్రోసాఫ్ట్ ఈ విష‌యంలో ఇంకాస్త ముందుకు వెళ్లి.. ఏకంగా.. మ‌రో ఏడాది వ‌ర‌కు త‌న ఈవెంట్ల‌న్నింటినీ కేవ‌లం ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ వ‌చ్చే ఏడాది (2021) జూలై వ‌ర‌కు జ‌ర‌గాల్సిన త‌న అన్ని ఈవెంట్ల‌ను కేవ‌లం ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఆ సంస్థ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. కోవిడ్‌-19 కార‌ణంగా వ‌చ్చే ఏడాది (2021) జూలై వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌ర‌గాల్సిన అన్ని ఎక్స్‌ట‌ర్న‌ల్‌, ఇంట‌ర్న‌ల్ ఈవెంట్ల‌ను కేవ‌లం ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హిస్తామ‌ని.. మైక్రోసాఫ్ట్ తెలియ‌జేసింది.

కాగా ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ ఈవెంట్ జ‌ర‌గాల్సి ఉంది. ఇక ఆ త‌రువాత కంప్యూటెక్స్ 2020లో మైక్రోసాఫ్ట్ పాల్గొనాల్సి ఉంది. అలాగే 2021లో జ‌ర‌గ‌నున్న క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సెస్‌), బిల్డ్ 2021 ఈవెంట్ల‌లోనూ మైక్రోసాఫ్ట్ పాల్గొనాల్సి ఉంది. కానీ తాజా ప్ర‌క‌ట‌న‌తో ఆ ఈవెంట్ల‌లో మైక్రోసాఫ్ట్ పాల్గొన‌బోవ‌డం లేదు. అయితే ఇత‌ర సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈ విష‌యంపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version