స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక్క క్షణం కూడా దాన్ని వదిలి ఉండలేని పరిస్థితి.ఇంట్లో బయట ఎప్పుడు చేతిలోనే వుండే అతి ముఖ్యమైన వస్తువు గా మొబైల్ మారిపోయింది. ముఖ్యంగా ఫోన్ చార్జింగ్‌లో ఉన్నప్పుడు కూడా దాన్ని వాడుతూ, మాట్లాడుతూ ఉండటం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటు తెలియకుండానే మన ప్రాణాలకు పెద్ద ప్రమాదాన్ని కొని తెస్తోంది. చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను వాడటం లేదా మాట్లాడటం వలన జరిగే ప్రమాదాలు ఏమిటి? ఈ నిత్య జీవితపు చిన్న అలవాటు వెనుక దాగిన పెద్ద ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా వాడటం అనేది విద్యుత్ ప్రమాదాలు మరియు ఉష్ణోగ్రత పెరగడం అనే రెండు ముఖ్యమైన సమస్యలకు దారితీస్తుంది. ఫోన్ చార్జ్ అవుతున్న సమయంలో, బ్యాటరీ నుండి వేడి విడుదల అవుతుంది. అదే సమయంలో మనం ఫోన్‌ను ఉపయోగిస్తే, ప్రాసెసర్ కూడా పనిచేయడం వల్ల అదనపు వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ రెట్టింపు వేడి కారణంగా ఫోన్ ఉష్ణోగ్రత త్వరగా, ప్రమాదకరంగా పెరిగిపోతుంది. ఉష్ణోగ్రత అధికంగా పెరిగినప్పుడు, లిథియం-అయాన్ బ్యాటరీలు ఉబ్బి, మంటలు అంటుకోవడం లేదా పేలిపోవడం వంటివి జరగవచ్చు.

ఈ ప్రమాదాలకు నకిలీ లేదా నాణ్యత లేని చార్జర్లు, కేబుల్స్ లేదా పవర్ బ్యాంకులు వాడినప్పుడు అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చార్జింగ్‌లో ఉన్నప్పుడు విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఫోన్లో ఏదైనా అంతర్గత లోపం తలెత్తితే, విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో తడి చేతులతో చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను పట్టుకోవడం ప్రాణాంతకం కావచ్చు. అందుకే మీ భద్రత మరియు మీ ఫోన్ బ్యాటరీ యొక్క దీర్ఘాయుష్షు కోసం, ఫోన్ చార్జ్ అవుతున్నప్పుడు దాన్ని వాడకుండా ఉండటం అత్యవసరమైతే మాత్రమే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటం ఉత్తమం.
గమనిక: చార్జర్లు మరియు కేబుల్లు ఎల్లప్పుడూ మంచి నాణ్యత కలిగినవి ముఖ్యంగా మీ ఫోన్ కంపెనీ సూచించినవే వాడండి. చార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ వేడెక్కితే, వెంటనే దాన్ని చార్జింగ్ నుండి తీసివేయండి. సురక్షితమైన అలవాటును పాటించడం ద్వారా అనవసర ప్రమాదాలను నివారించవచ్చు.
