ఎన్నికల సంస్కరణల విషయంలో ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తున్న ఎలక్షన్ కమిషన్ ఐడీకార్డు విషయంలో తనదైన ముద్ర వేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఐడీకార్డును కలర్‌లో ప్లాస్టిక్ దశకు తీసుకువచ్చిన కమిషన్ ఇప్పుడు తాజాగా స్మార్ట్‌కార్డుగా మారుస్తూ ఓటర్లకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో పంపిణీకి చర్యలు చేపట్టడం గమనార్హం. స్మార్ట్ ఓటరు ఐడెంటిటి కార్డులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈసీ హోలోగ్రామ్ కలిగి ఉన్న ఈ స్మార్ట్ కార్డును ప్లాస్టిక్‌తో రూపొందించారు. అంతేకాకుండా ఈ కార్డులు అనేక లేయర్లు కలిగి ఉంటాయి.
దీంతో ఈ కార్డులను నకిలీవిగా మార్చడం అంత ఈజీకాదని నిపుణులు చెబుతున్నారు. కార్డుపై యూనిక్ బార్ కోడ్ ప్రింట్ అయ్యి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే.. ఓటర్ వివరాలు సిస్టమ్‌లో డిస్‌ప్లే అవుతాయి. దీంతో ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓటు హక్కు ఉండటాన్ని అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఇది స్థానికతకు గుర్తింపు కార్డుగా కూడా వినియోగించవచ్చని సూచిస్తున్నారు. అటు బ్లాక్ అండ్ వైట్, కలర్ ఓటర్ ఐడీ కార్డులు ఉన్నవారు ఈసీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. 15 రోజుల్లో ఇంటికి కొత్త ఎపిక్ ఓటర్ ఐడీ వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల గుర్తింపు కార్డును ఒకప్పుడు కీలకమైన పనులన్నింటికీ ఉపయోగించేవారు. ఎప్పుడయితే ఆధార్ అమల్లోకి వచ్చిదో అప్పటి నుంచి అడ్రెస్ ప్రూఫ్ దగ్గర నుంచి.. ఫోటో ఐడీ వరకు ఆధార్ కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక నయా స్మార్ట్ ఓటరు కార్డుల జారీలో అభివృద్ది చెందిన దేశాలు యూఎస్, కెనడా, బ్రిటన్ వంటి దేశాలతో ఇవి పోలి ఉండటం గమనార్హం. కాగా, ప్రస్తుతం 18 ఏళ్ళు నిండి.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులను ఇష్యు చేయనున్నారు. వారందరికీ ఈ కార్డులు వచ్చే ఏడాది జనవరి 25న అందనున్నాయి. అంతేకాక ఈ కార్డుల కోసం రూ.30లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.