టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు గత నెలలో రోజుకు 2జీబీ డేటా చొప్పున 4 రోజులకు గాను మొత్తం 8 జీబీ డేటాను ఉచితంగా అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ఆఫర్‌ను తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అందిస్తోంది. గ్రేస్ ప్లాన్ పేరిట ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో కస్టమర్లు తాము వాడుతున్న ప్లాన్ వాలిడిటీ ముగిసినా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
గ్రేస్ ప్లాన్‌లో భాగంగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లు 24 గంటల గ్రేస్ టైమ్ పొందవచ్చు. తాము వాడుతున్న ప్లాన్ వాలిడిటీ ముగిసినా.. 24 గంటలపాటు గ్రేస్ ప్లాన్ కింద సర్వీసులను వాడుకోవచ్చు. అయితే ప్లాన్ ముగిసిన వెంటనే రీచార్జి చేయకపోతే ఈ గ్రేస్ ప్లాన్ ఆటోమేటిగ్గా యాక్టివేట్ అయి 24 గంటల పాటు ఉంటుంది. ఆ సమయంలోగా కస్టమర్లు తమకు కావల్సిన ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక గ్రేస్ ప్లాన్‌లో కేవలం కాల్స్ మాత్రమే లభిస్తాయా, డేటా సర్వీసులను కూడా వాడుకోవచ్చా.. అనే విషయంపై జియో స్పష్టతనివ్వలేదు. అయితే నెలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్‌ను కస్టమర్లు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది.