సామ్‌సంగ్‌ నియాన్‌ – మనిషికి ‘ప్రతిరూపం’

-

అది నిజంగా మనిషి కాదు. తెర మీద ‘మనిషి లాంటి’ బొమ్మ. నియాన్‌ను ప్రత్యేకమైన పనుల కోసమే వాడాలి. ‘సిరి’ లాగ ఏ పని చెప్పినా చేయదు. నిజానికి నియాన్‌ ఒక విడియో చాట్‌బాట్‌.

సామ్‌సంగ్‌ టెక్నాలజీ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ (స్టార్‌)… భవిష్యత్‌ సాంకేతికతకు నిజరూపమివ్వడానికి స్థాపించబడ్డ ఒక ‘రహస్య’ సంస్థ. కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి కొత్త కొత్త ఉత్పత్తులను తయారుచేయడానికి ఉద్దేశించినదే ఈ కంపెనీ. ఈ కంపెనీ తయారుచేసిన మొట్టమొదటి సాంకేతికతే నియాన్‌.

ఇది ఒక చాట్‌ బాట్‌. ఈ మధ్య చాలా సేవల కంపెనీలు, బ్యాంకులు తమ సొంత ఏఐ చాట్‌ బాట్‌లను ప్రారంభించాయి. ‘మీకేవిధంగా సహాయపడగలను?’ అంటూ వెబ్‌సైట్‌ మూలన ఒక చిన్న విండో ఓపెనవడం చాలామంది చూసే ఉంటారు. కాకపోతే అదంతా అక్షరాలమయం. మనం మన ప్రశ్నను టైప్‌ చేస్తే, అది దాని సమాధానాన్ని టైప్‌ చేస్తుంది. నియాన్‌ ఒక విడియో చాట్‌బాట్‌. అదే పని చేస్తుంది. కాని అలా కాదు. ఒక మనిషి రూపంలో ప్రత్యక్షమై, మన సందేహాలను తీరుస్తుంది. మన ప్రశ్నలను అనుసరించి అది ముఖ కవళికలను మార్చడం, భంగిమలను పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తుంది. పూర్తిగా కృత్రిమ మేధస్సుపై ఆధారపడి పనిచేసే ఈ నియాన్‌ మన ప్రశ్నల ద్వారా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూఉంటుంది.

నియాన్‌కు స్టార్‌ ఇచ్చిన నిర్వచనమేమిటంటే, ‘‘ కంప్యూటర్‌ ద్వారా సృష్టించబడి, మనిషిలా కనిపిస్తూ, ప్రవర్తిస్తూ, భావోద్వేగాలను కూడా ప్రదర్శించగలిగే ఒకానొక కాల్పనిక రూపం’’. నియాన్‌, అందరికీ తెలిసిన సిరి, బిక్స్‌బీ లాంటి డిజిటల్‌ అసిస్టెంట్‌ కాదు, ఇవ్వాళ వాతావరణమేంటంటే చెప్పడానికి. లక్ష్యబద్ధమైన విధులను స్వతంత్రంగా నిర్వర్తించగలిగే ఒక రూపం. ఒక టీచర్‌గా, సలహాదారుగా, టీవీ యాంకర్‌గా, అన్నింటికీ మించి ఒక ప్రత్యేకమైన పనిలో మనకు సహచరుడిగా బ్రహ్మాండంగా పనికొస్తాడని స్టార్‌ సిఈఓ ప్రణవ్‌ మిస్త్రీ చెబుతున్నారు.

‘‘నియాన్‌, మనుషుల పోలికలతో (అమ్మాయి లేదా అబ్బాయి) ఉంటుంది, మనిషిలా మాట్లాడుతుంది కానీ, పూర్తిగా మనిషికి నకలు కాదు. ప్రతి నియాన్‌ తనకే సొంతమైన వ్యక్తిత్వంతో ఉండే ఒక అసాధారణ స్వరూపం’’ అని ప్రణవ్‌ మిస్త్రీ విశదీకరించారు.

అయితే, నియాన్‌ సామ్‌సంగ్‌ ద్వారా నిధులు పొందే స్టార్‌ ల్యాబ్‌ ఉత్పత్తి అయినప్పటికీ, సామ్‌సంగ్‌కు ఏవిధమైన సంబంధం లేదు. స్టార్‌ ల్యాబ్‌ స్వయంప్రతిపత్తి కలిగి, సైన్స్‌ ఫిక్షన్‌ను నిజరూపంలో అవిష్కరించడమే విధిగా కలిగిన సంస్థ.

Read more RELATED
Recommended to you

Exit mobile version