సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ ఇక తన యూజర్లకు చిన్న చిన్న టాస్క్‌లు చేస్తూ డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించనుంది. ఇందుకు గాను ఆ సంస్థ టాస్క్ మేట్ పేరిట ఓ యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. దీన్ని ప్రస్తుతం దేశంలో పలు ఎంపిక చేసిన యూజర్లతో గూగుల్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
గూగుల్‌కు చెందిన టాస్క్ మేట్‌లో యూజర్లు చిన్న పాటి టాస్క్‌లను చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. అవి రెండు రకాలుగా ఉంటాయి. తాము ఉన్న ప్రాంతంలోనే కాకుండా ఎక్కడైనా ఈ టాస్క్‌లను పూర్తి చేయవచ్చు. తమకు సమీపంలోని రెస్టారెంట్ లేదా ఏదైనా ప్రదేశానికి చెందిన ఫొటోలను తీసి గూగుల్‌లో యాడ్ చేయడం లేదా గూగుల్ చేపట్టే సర్వేలకు బదులివ్వడం అలాగే ఇంగ్లిష్ లో ఉండే పదాలను తమ మాతృ భాషలోకి అనువదించడం.. ఇలా చిన్న పాటి టాస్క్‌లను చేయడం ద్వారా గూగుల్ యూజర్లు ఇకపై డబ్బులు సంపాదించవచ్చు.
అయితే టాస్క్ మేట్ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. దాన్ని ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉన్నందున దాన్ని అందరూ వాడలేరు. రిఫరల్ కోడ్ ఉంటే దాని ద్వారా టాస్క్ మేట్ యాప్ లో రిజిస్టర్ చేసుకుని అనంతరం టాస్క్‌లు పూర్తి చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఈ యాప్ పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో ఆ వివరాలను మాత్రం గూగుల్ ఇంకా వెల్లడించలేదు.