టాటా గ్రూప్ గురించి తెలియని వారుండరు. పప్పు ఉప్పు నుంచి కంప్యూటర్ సర్వీసెస్ వరకు ఈ సంస్థ దాదాపు అన్ని రంగాల్లో తన సత్తా చాటుతోంది. ఇక ఇప్పుడు ఐఫోన్లను తయారు చేసే తొలి భారత కంపెనీగా గుర్తింపు పొందింది. తైవాన్ సంస్థ విస్ట్రాన్‌తో టాటా గ్రూపు 125 మిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మరో రెండున్నరేళ్లలో టాటా తయారు చేసే ఐఫోన్లను దేశ, విదేశాల్లో విక్రయించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించిన టాటా గ్రూప్.. విస్ట్రన్ కార్ప్‌తో ఏడాదిగా చర్చలు జరిపిందని టాటా గ్రూప్ ప్రతినిధి చెప్పారు. తొలుత జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చినా.. తర్వాత కొనుగోలుకే మొగ్గు చూపామని వెల్లడించారు . ఈ నేపథ్యంలోనే విస్ట్రాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో.. టాటా కొనుగోలు ఆఫర్‌కు ఆమోదం లభించిందని.. కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్‌లో 100శాతం వాటాలను టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదిరిందని విస్ట్రాన్ ఓ ప్రకటనలో పేర్కొంది.