ఒక వ్యాపారవేత్త పని నిమిత్తం పక్క ఊరికి బయల్దేరాడు. కొత్తగా కొన్న ఖరీదైన కారులో అద్దాలు మూసేసుకుని ఏసీ వేసుకుని ఎండాకాలం పూట కూడా వేడి తెలియకుండా వెళ్తున్నాడు. కారు ఎంత స్పీడ్ గా వెళ్తుందో అతనికి తెలియట్లేదు. డ్రైవర్ తన పని పూర్తి చేద్దాం అన్న నెపంతో వేగం పెంచాడు. అప్పుడే పక్క ఊరిలోకి ఎంటర్ అయ్యింది కారు. అయినా అంతే వేగంగా వెళ్తున్నాడు డ్రైవర్. వ్యాపారవేత్త ఏదో ఆలోచనలో ఉన్నాడు. అప్పుడే టప్ మన్న శబ్దం వినిపించింది.
కారు వెనకాల ఏదో తగిలినట్టు చప్పుడు. డ్రైవర్ వెంటనే కారాపాడు. వ్యాపారవేత్త ఏమైందని కారు దిగాడు. వెనక్కి వచ్చి చూస్తే, కారుకి డెంట్ పడింది. దానికి కారణం నేనే అన్నట్టుగా ఇటుక అక్కడే పడి ఉంది. డ్రైవర్ చుట్టూ చూసాడు. కాంపౌండ్ వాల్ కి ఆనుకుని చిన్న పూలమొక్క వెనకాల దాక్కున్న ఒక పిల్లాడు కనబడ్డాడు. పిల్లాడి దగ్గరికి వెళ్ళి, అది విసిరింది నువ్వేనా అని అడిగాడు. అతను భయపడుతూనే నేనే అన్నాడు. ఎంత పొగరు, ఖరీదైన కారు మీద ఇటుక విసిరిందే కాకుండా భయం లేకుండా నేనే అంటున్నావా అన్నాడు. ఆ వ్యాపారవేత్త ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు.
ఇప్పటి వరకు ఎన్నో కార్లు వెళ్ళాయి. ఒక్కరూ కూడా ఆపలేదు. అందుకే ఇటుక విసిరాను. అదిగో అక్కడ చూడు, అని కొద్ది దూరంలోని దృశ్యాన్ని చూపించాడు. చక్రాల కుర్చీలోంచి జారిపడ్డ ఒక వ్యక్తి రోడ్డు మీద ఉన్నాడు. వాడు నా తమ్ముడు. రోడ్డు మీద పడ్డాడు. చక్రాల కుర్చీలో కూర్చోబెట్టాలని అప్పటి నుండి చూస్తున్నా. నావల్ల కావట్లేదు. ఇటుక విసిరితే అయినా ఆగుతారేమో అని అలా చేసాను. అది చూడగానే వ్యాపారవేత్త చలించిపోయాడు. వెంటనే అక్కడికి వెళ్ళి సాయం చేసాడు.
పిల్లాడు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఖరీదైన కారుకి పడ్డ డెంటింగ్ అతన్ని బాధించలేదు. సాయం చేసే వారు లేక పడ్డ అవస్థకి అతడు చలించాడు. వేగంగా వెళ్తే కాలాన్ని అందుకుంటావేమో కానీ, ఆ కాల గమనంలో నీతో ఉన్న వారిని మర్చిపోతావని అనిపించింది. ఆ క్షణం అతనికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.