మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి కాదు అది మీ జీవితాన్ని అడ్డుకునే ఒక తీవ్రమైన నరాలకు సంబంధించిన వ్యాధి. తరచుగా వచ్చే ఈ భరించలేని నొప్పి కాంతి, శబ్దాన్ని భరించలేని స్థితిలో ఉంటుంది. కొందరిలో వాంతులు వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. పూర్తిగా మనిషిని బలహీనంగా మారుస్తుంది. మైగ్రేన్ బాధ నుండి ఉపశమనం పొందడానికి కొన్ని రోజువారి అలవాట్లు చాలా సహాయ పడతాయి. ఈ చిన్న చిన్న చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మైగ్రేన్ తీవ్రతను తగ్గించుకోవచ్చు. మైగ్రేన్ ను కొంతవరకు నివారించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటనేది చూసేద్దాం..
రోజువారి అలవాట్లతో మైగ్రేన్ కు చెక్ పెట్టవచ్చు. మైగ్రేన్ నొప్పి ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రతిరోజూ జాగ్రత్తగా ఉండడం ద్వారా దీనిని నివారించవచ్చు. మీ ఆహారం, నిద్ర జీవనశైలిలో చిన్న మార్పులు మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.
నిర్దిష్ట నిద్ర: ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం మేలుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరంలోని జీవ గడియారాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఎక్కువ గా మైగ్రేన్ నొప్పి ఒక వైపు మాత్రమే వస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం లేదా అతిగా నిద్ర పోవడం కూడా మైగ్రేన్ కి కారణం అవ్వచ్చు. సుమారు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.
సరైన ఆహారం : మైగ్రేన్ కి ప్రధాన కారణం నిర్జలీకరణం. రోజులో తగినన్ని నీళ్లు తాగడం ముఖ్యం. అలాగే భోజనం సమయానికి తీసుకోవడం. భోజనం మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గి మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. కెఫెన్ అధికంగా ఉండే కాఫీ, చాక్లెట్, స్వీట్స్ వంటివి కూడా కొంతమందిలో మైగ్రేన్ కు దారి తీయవచ్చు.

ఒత్తిడి తగ్గించడం: ఒత్తిడి అనేది మైగ్రేన్ కి మరో ప్రధాన కారణం. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు ఇష్టపడే ఒక అభిరుచిని ఎంచుకొని, దానికి తగినటువంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఉదాహరణకి పచ్చని చెట్ల మధ్య నడవడం, విన సొంపైన మ్యూజిక్ ని ఆనందించడం వంటివి.
సున్నితత్వం అర్థం చేసుకోవడం : చాలామంది మైగ్రేన్ వచ్చిన వారిలో అధికంగా కనిపించే లక్షణం వెలుతురిని చూడలేకపోవడం, శబ్దాలను వినలేక పోవడం, వాసనను భరించలేకపోవడం వంటి లక్షణాలు తరచుగా ఎక్కువ మందిలో కనిపిస్తాయి. బలమైన సువాసనలు, కఠినమైన కాంతి శబ్దాలు మైగ్రేన్ ను ఎక్కువ చేస్తాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. గదిలో నిశ్శబ్దమైన వాతావరణాన్ని ఉంచుకోండి. సువాసనలు రాకుండా జాగ్రత్త పడండి. శబ్దాలు వినకుండా చేవలల్లో కాటన్ ధరించండి. ఎండలో వెళ్లేటప్పుడు సన్ గ్లాస్ ధరించండి. ఎక్కువ వాసన వచ్చే పర్ఫ్యూమ్స్ కి దూరంగా ఉండడం వంటివి చేయండి.
గమనిక: పైన ఇచ్చిన చిట్కాలు కేవలం సమాచారం కోసం మాత్రమే, ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీరు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి.