ఆధార్-ఓటు లింక్, ఓట్ల నమోదుకు సంవత్సరానికి నాలుగు ఛాన్సులు…!

నకిలీ ఓటర్లు పెరగడం లాంటి ఇబ్బందులు జరగకుండా ఎన్నికలు సక్రమంగా జరగడానికి కేంద్ర క్యాబినెట్ 4 ఎన్నికల సంస్కరణలకు ఆమోదం తెలిపింది. కొన్ని కీలక మార్పులు కూడా కేంద్రం తీసుకురావడం జరిగింది. ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగు పరచడానికి ఎన్నికల సంఘానికి మరింత అధికారాన్ని ఇవ్వడానికి నకిలీ ఓట్లను వేయకుండా కట్టడి చేయడానికి నాలుగు ప్రధాన సంస్కరణలు తీసుకు వచ్చింది.

మనం మామూలుగా ఎలా అయితే పాన్ కార్డుని ఆధార్ కార్డు తో లింక్ చేసుకుంటామొ ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా చేయడం వలన నకిలీ ఓట్లను వేయకుండా ఆపవచ్చని కేంద్రం అంటోంది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి యువతకి మరిన్ని అవకాశాలు కల్పించాలని కేంద్రం అనుకుంది.

వచ్చే ఏడాది జనవరి 1 నుండి 18 సంవత్సరాలు నిండిన మొదటిసారి ఓటర్లు నాలుగు వేరు వేరు కటాఫ్ తేదీలతో ఒక సంవత్సరానికి నాలుగు సార్లు నమోదు చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. అయితే వాళ్లు ఇప్పటి వరకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే నమోదు చేసుకోవడానికి వీలుంది. దీన్ని సవరించాలని కేంద్రం అనుకుంటోంది.

ఇది ఇలా ఉంటే సర్వీస్ ఓటర్లకు కూడా ఊరటను కల్పించింది కేంద్రం. సర్వీస్ ఆఫీసర్ల భర్తకు కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తూ సర్వీస్ ఆఫీసర్ల కోసం చట్టాన్ని లింగ భేదాలు లేకుండా చేయాలని కూడా నిర్ణయించింది. ఈ సదుపాయం కేవలం పురుష సర్వీస్ ఓటరు భార్యకి మాత్రమే అందుబాటులో ఉంది.

కానీ ఇకపై మహిళా సర్వీస్ ఓటరు భర్తకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు. అలానే ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ కోసం దేశంలో ఏదైనా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవచ్చని.. దీనిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఎన్నికల సంఘానికి ఇస్తూ మరో సంస్కరణని కేంద్రం తీసుకురానుంది.