తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడే భవిష్యత్తులో వారి చదువుకు అయ్యే ఖర్చులకు గాను డబ్బులు పొదుపు చేయాల్సి ఉంటుంది. అయితే అలా చేయలేని వారి కోసం అనేక బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకులు 7 నుంచి 8 సంవత్సరాల కాలవ్యవధితో ఎడ్యుకేషన్ లోన్లను ఇస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఈ లోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడ్యుకేషన్ లోన్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. ఈ బ్యాంకులో కేవలం 6.8 శాతం వడ్డీతో రూ.20 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. 7 ఏళ్ల కాలవ్యవధితో లోన్ ఇస్తారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆప్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 6.85 శాతం వడ్డీకి విద్యా రుణాలను అందిస్తున్నాయి. గరిష్టంగా రూ.20 లక్షల లోన్‌ను 7 ఏళ్ల కాలవ్యవధితో పొందవచ్చు. ఇక ఎస్‌బీఐ 6.9 శాతం వడ్డీ రేటుతో అంతే మొత్తాన్ని అంతే కాల వ్యవధితో లోన్‌గా ఇస్తోంది.
కాగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.2 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 9.55, 9.70, 11.25 శాతం వడ్డీ రేట్లకు ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తున్నాయి. ఇక ఎడ్యుకేషన్ లోన్లను తీసుకుంటే నెలకు కట్టే ఈఎంఐకి గాను ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80ఇ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఏ లోన్ తీసుకున్నా సరే.. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జిలు ఉంటాయి. సాధరణంగా వడ్డీ రేటు తక్కువ ఉంటే ఆయా చార్జిలను ఎక్కువగా వసూలు చేస్తారు. కనుక లోన్ తీసుకునేటప్పుడు ఆయా చార్జిలను కూడా ఎంత మొత్తంలో వసూలు చేస్తారో ముందుగానే తెలుసుకుంటే మంచిది.