పోస్టాఫీస్ ఖాతాదారులకు గతంలో ఇతర సేవలను పొందాలంటే కచ్చితంగా పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాక్ (ఐపీపీబీ) సేవలు అందుబాటులోకి రావడంతో పోస్టాఫీస్‌లకు వెళ్లే బాధ తప్పింది. దీంతో ఏ సేవనైనా ఆన్‌లైన్‌లోనే ఉపయోగించుకునేందుకు వీలు ఏర్పడింది. ఇక ఐపీపీబీ ద్వారా ఖాతాదారులు తమ బ్యాలెన్స్ ఎంత ఉందో సులభంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇతర ఆర్థిక లావాదేవీలను కూడా నిర్వహించవచ్చు. దీని వల్ల పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదు.
ఇక పోస్టాఫీస్ మనకు రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి అకౌంట్ (ఎస్ఎస్ఏ) వంటి పలు రకాల పథకాలను అందిస్తోంది. వీటిల్లో ఐపీపీబీ ద్వారా ట్రాన్సాక్షన్లను చాలా సులభంగా చేయవచ్చు. పోస్టాఫీస్ ఖాతాదారులు ఐపీపీబీ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నగదును డిపాజిట్ చేయవచ్చు.
ఇక పోస్టాఫీస్‌లో పీపీఎఫ్ ఖాతా ఉన్నవారు ఐపీపీబీకి చెందిన ప్లాట్‌ఫాం ద్వారా సులభంగా ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. అందుకు గాను ఈ స్టెప్‌లను పాటించాలి.
* మీకు ఉన్న ఇతర బ్యాంక్ అకౌంట్లలో దేని నుంచైనా సరే ఐపీపీబీ అకౌంట్‌కు నగదును బదిలీ చేయాలి.
* ఐపీపీబీ యాప్‌లో డీవోపీ సర్వీసెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో ఆర్‌డీ, పీపీఎఫ్, ఎస్ఎస్ఏ వంటి సేవలకు చెందిన ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో పీపీఎఫ్‌ను ఎంచుకోవాలి.
* పీపీఎఫ్ నంబర్‌ను, డీవోపీ కస్టమర్ ఐడీని ఎంటర్ చేయాలి.
* ఎంత మొత్తంలో నగదు డిపాజిట్ చేయదలుచుకున్నారో అందుకు సంబంధించిన సంఖ్యను నమోదు చేయాలి. అనంతరం పే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* ఐపీపీబీ ద్వారా పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపిస్తుంది.
అయితే ఐపీపీబీ ద్వారా కేవలం పోస్టాఫీస్ పీపీఎఫ్ అకౌంట్‌లో మాత్రమే కాకుండా, ఇతర పథకాల్లోనూ పైన తెలిపిన విధంగా సులభంగా డబ్బును చెల్లించవచ్చు. అందుకు పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదు. కాగా ఇటీవలే పోస్టల్ శాఖ వారు డాక్ పే అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని సహాయంతో కూడా పోస్టాఫీస్ కస్టమర్లు తమ పథకాలకు గాను నగదును చెల్లించవచ్చు.