తెలంగాణ ఎత్తైన జలపాతం !

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. చాలా ప్రదేశాలకు ఇప్పటికీ రావల్సినంత పేరు రాలేదు. దక్షిణ భారత కాశ్మీర్‌గా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. ప్రకృతి వడిలో పరవశించిపోవాలనుకునేవారికి ఇక్కడి జలపాతాలు అద్భుతమైన కేంద్రాలు అనడంలో అతిశయోక్తిలేదు. ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. పక్కనే కేవలం కొన్ని వందల కి.మీ దూరంలో పరవశింపచేసే ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో తెలంగాణలోనే ఎత్తయిన జలపాతం గురించి తెలుసుకుందాం….


కుంటాల జలపాతం బోథ్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందింది. కుంటాల పేరు వెనుక చరిత్ర చూస్తే….శకుంతల, దుష్యంతులు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కుంతల రానురాను కుంటాలగా మారింది. జలపాతం చేరాలంటే మెట్లు దిగి వెళ్లాలి. దగ్గరికెళ్తున్న కొద్దీ పరుగులు తీస్తున్న నీళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది. 45 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడే నీళ్లు వినసొంపైన శబ్దం చేస్తుంటాయి. జలపాతం కిందికి చేరుకొని జలకాలాటలలో..కిలకిల పాటలలో కొద్దిసేపు ఎంజాయ్ చెయ్యొచ్చు.

జలపాతం వద్ద పైనుంచి కిందికి నీటి ప్రవాహం చూస్తే అప్సరలు దివి నుంచి భువిపైకి దిగుతున్నట్లు వెండి జలతారలుగా కనిపిస్తుంది. వర్షా, శీతాకాలాల్లో ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే జలపాతం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జలకన్య అందాలను దూరం నుంచే ఆస్వాదించాలి. మరీ సమీపంలోకి వెళ్లకూడదు. హెచ్చరికలను బేఖాతరు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందాలను తిలకించడానికి వచ్చి హెచ్చరికలు పాటించకుండా మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. జలపాతం పక్కనే ఏడు అడుగుల గుహ ఉంది. దీని గుండా మనిషి మాత్రమే ప్రవేశించే వీలుంది. పక్కనే నీటి సుడిగుండం, సోమేశ్వరాలయం, కాకతీయుల కాలంనాటి రాతి నంది విగ్రహాలున్నాయి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version