మారిన రూల్స్‌…. నిమిషాల్లోనే పాన్ కార్డు

పాన్‌కార్డు పొందాల‌నుకునే వారికి గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా పాన్ కార్డు పొందాల‌నుకుంటే వాళ్ల‌కు క‌నీసం రెండు నుంచి మూడు వారాలు ప‌డుతుంది. మ‌నం ఆధార్ కార్డు, ఫొటోతో అప్లై చేసుకున్నాక క‌నీసం ఆ మాత్రం టైం ప‌ట్టాక కాని కార్డు రాదు. అయితే ఇప్పుడు అంత టైం వేచి చూడాల్సిన అవ‌స‌రం లేదు.

ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ సులభంగా పాన్ కార్డును పొందే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసిన కొద్ది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందేలా మార్పులు చేర్పులు చేసింది. పాన్ కార్డు పొందాల‌నుకునే వారు ఆన్‌లైన్లో అప్లై చేసిన నిమిషాల్లోనే కార్డు వ‌చ్చేస్తుంద‌న్న‌మాట‌. కార్డు పొందాల‌నుకునే వారు ఆధార్ డేటా ఎంట్రీ చేసిన వెంట‌నే వారికి ఎలక్ట్రానిక్ పాన్ (ఈ పాన్) రెడీ అయిపోతుంది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో మూడు వారాల పాటు పాన్ కార్డు కోసం వేచి చూడాలంటే ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఎలక్ట్రానిక్ పాన్ ఉచితంగా అందించాలని నిర్ణ‌యం తీసుకుంది. పాన్ కార్డు పొందాల‌నుకునే వారు చిరునామా, తండ్రి పేరు, పుట్టిన తేదీ వివ‌రాలు పొందుప‌రిస్తే చాలు. ఆ త‌ర్వాత పాన్‌కార్డుపై డిజిట‌ల్ సైన్ చేస్తే చాలు.

ఈ డిజిట‌ల్ పాన్ కార్డులో ఫోటో పక్కన డెమోగ్రాఫిక్ డేటా ఉంటుంది. డెమోగ్రాఫిక్ డేటా స్కాన్ చేసి ఎక్కడైనా ఎలక్ట్రానిక్ పాన్ కార్డును వాడుకోవచ్చు. బ్యాంకులలో ఎక్కువ నగదుతో లావాదేవీలు జరపాలంటే పాన్ కార్డు తప్పనిసరి. త్వ‌ర‌లోనే ఈ ఎల‌క్ట్రానిక్ పాన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.