ఇప్పటి వరకు ప్రభుత్వ రేషన్ దుకాణాల వద్ద బయోమెట్రిక్ ( వేలిముద్రలు) పెడితేనే సరుకులు పొందేవారు. వచ్చేనెల నుంచి ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి పలికింది. ఫిబ్రవరి నుంచి ఓటీపీ ద్వారా సరుకులు అందజేయనున్నారు. రేషన్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయగానే ఫోన్‌కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పి రేషన్ సరుకులు పొందవచ్చు. ఈ ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరా శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే రేషన్ దుకాణాలకు ఆదేశాలు జారీ కావడంతో లబ్ధిదారుల ఆధార్‌తో మొబైల్ లింక్ ఉందో లేదో పరిశీలించి ఒక వేళ లింక్ లేకుంటే మీ–సేవ మరియు ఈ–సేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ లింక్ చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపి ఓటీపీ పద్ధతిలో సరుకులు అందజేయాలని సంబంధిత శాఖ నిర్ణయించింది. ఇకపై ఆ«ధార్‌తో ఫోన్ నంబర్ లింక్ ఉంటేనే సరుకులు పొందే ఆస్కారం ఉంటుంది.
30 శాతమే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లబ్ధిదారుల్లో దాదాపుగా 30 శాతం మందికి ఆధార్‌తో లింక్ లేనట్లు సమాచారం. హెడ్‌ఆఫ్ ఫ్యామిలీ మెంబర్‌తో పాటు సరుకుల కోసం వచ్చే లబ్ధిదారుల నంబర్లు కూడా లింక్ చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు. కొందరికి మొబైల్ నంబర్లు లేకపోవడం, ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో సమస్యగా మారింది. అందుకోసం జనవరి చివరి వరకు లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
పంపిణీ విధానం..
ప్రభుత్వ రేషన్ దుకాణాలకు వెళ్లినప్పుడు లబ్ధిదారులకు తమ రేషన్ కార్డులోని చివరి నాలుగు నంబర్లు చెప్పాలి. అప్పుడు ఈ –పాస్ యంత్రంలో మీరు చెప్పిన నాలుగు నంబర్లు ఎంట్రీ చేయగానే మీ ఫోన్‌కు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ ఓటీపీని డీలర్ అందులో ఫీడ్ చేయగానే సరుకులు పొందవచ్చని ఆమోదం లభిస్తుంది.