మన దేశంలో కేంద్రం మరియు రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకాలు చాలా శాతం మంది ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు, రుణాలు మరియు ఇతర ఆర్థిక సహాయాల ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ల కోసం కూడా కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వాటిలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కూడా ఒకటి. ఈ పథకం ద్వారా పేద, ధనిక అనే తేడా లేకుండా సీనియర్ సిటిజెన్ లకు ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయాన్ని కేంద్రం అందిస్తోంది.
అర్హత వివరాలు:
ఈ పథకానికి 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజెన్ లు అందరూ అర్హులే. వారి ఆదాయం లేక వృత్తికి సంబంధం లేకుండా సీనియర్ సిటిజెన్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని కేంద్రం నిర్ధారించింది.
అప్లై చేసుకునే విధానం:
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ లేక ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా కేవైసీ కోసం వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు ప్రక్రియకు కేవలం ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే అవసరం మరియు కుటుంబ సభ్యుల వివరాలను, చిరునామా వంటి వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ఆమోదాన్ని పొందవచ్చు. ఎప్పుడైతే ఆమోదం లభిస్తుందో ఆయుష్మాన్ కార్డు ని పొందుతారు. దాన్ని డౌన్లోడ్ చేసుకుని సంవత్సరానికి ఐదు లక్షల వరకు లబ్ధిని పొందవచ్చు. ఒకవేళ ఒక కుటుంబంలో 70 ఏళ్లకు పైబడిన వారు ఇద్దరు కనుక ఉంటే వారికి సగం సగం ప్రయోజనం అందుతుంది. ప్రైవేట్ వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనాన్ని పొందుతున్నా ఈ ఐదు లక్షల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.