ట్రావెలింగ్ లో సరికొత్త ట్రెండ్.. వర్కేషన్ గురించి విన్నారా..?

కరోనా కారణంగా ఇల్లు దాటి బయటకి వెళ్ళకుండా అయిపోయాం. ఇక ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలంటే అస్సలు వద్దంటున్నాం. కరోనా విస్తరిస్తుందన్న కారణంగా ఆఫీసు పనులని కూడా ఇంటి నుండే చేస్తూ కాలం గడుపుతున్నాం. ఐతే ఇంట్లో నాలుగు గోడల మధ్యలో ఉండడం వల్ల మనుషుల్లో ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. పర్యాటక ప్రదేశాలని సందర్శించాలన్న ఆలోచనని దాదాపుగా మరిచిపోయాం.

ఐతే తాజాగా పర్యాటక ప్రాంతాలు సరికొత్త ప్యాకేజీతో వస్తున్నాయి. ఇంట్లో ఉండి పనిచేస్తూ బోర్ గా ఫీలయ్యే వారందరూ ఈ సరికొత్త ప్యాకేజీ గురించి తెలుసుకోవాలి. వర్కేషన్ అనే కొత్త కాన్సెప్ట్ ని పర్యాటకులకి ఆఫర్ చేస్తున్నాయి. వర్క్ + వెకేషన్.. రెండూ కలిపి ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్టే ఈ వర్కేషన్. దీని ప్రకారం పర్యాటక ప్రాంతానికి వచ్చినపుడు మీరు మీ ల్యాప్ టాప్ తో పాటు మీ పనికి కావాల్సిన అన్ని వస్తువులు తెచ్చుకొని, మీకు ఇష్టమైన ప్రదేశంలో కొండల్లో, బీచ్ దగ్గరా, నిశ్శబ్దంలో, హాయిగా పనిచేసుకోవచ్చు.

ఈ మేరకు మీ పనికి కావాల్సిన అన్ని వసతులు వాళ్ళు సమకూరుస్తున్నారు. పని చేసుకున్నంత సేపు చేసుకుని, ఆ తర్వాత ఆ చుట్టూ పక్కల ఉన్న ప్రకృతి అందాలని ఆస్వాదించవచ్చు. కొండల పైకి ట్రెక్కింగ్ చేయవచ్చు. సముద్రంలో డైవింగ్ చేయవచ్చు. ఇలా వారం కాదు, నెలా, అంతకుమించి రోజులు కూడా ఉండవచ్చు.

ఇంట్లో ఒకే వాతావరణంలో చేసే పనికి, పర్యాటక ప్రాంతంలో ప్రకృతి ఒడిలో చేసే పనికి చాలా తేడా ఉంటుంది. స్వఛ్ఛమైన గాలిని పీల్చుతూ, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ హాయిగా పని చేసుకోవడం ఎంత బాగుంటుందో కదా.. మరింకెందుకు ఆలస్యం.. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ వర్కేషన్ అనే కాన్సెప్ట్ ని బాగా ప్రోత్సహిస్తున్నాయి. మరింకే మీ ల్యాప్ టాప్ తో సహా పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొట్టేయండి మరి.