మన దేశంలో అత్యధిక వర్షపాతం కలిగిన ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకత, ఒక్కో జీవనశైలితో అద్భుతమైన అనుభూతుల్ని కలిగిస్తాయి. వానజడిలో తడిసిముద్దయ్యే ఈ ప్రాంతాల ప్రకృతి రమణీయతకు మనసు కొట్టుకుపోవడం ఖాయం. వాతావరణ తీవ్ర పరిస్థితులతో మనుగడకు సవాలు విసిరే ప్రాంతాల్లోను జనజీవనం యధేచ్ఛగా సాగిపోతుంది. దేశపు మాన్‌సూన్ గేట్‌వేలుగా ఈ ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల్లో ఎక్కువ వర్షంతో తడిసి ముద్దవుతాయి. ఈ ప్రాంతాల నుంచే రుతుపవనాలు దేశంలోకి వస్తాయి. కేవలం రుతుపవనాల సమయంలోనే కాదు దాదాపు ఏడాదంతా ముసురుతోనే ఈ ప్రాంతాల్లో తెల్లవారుతుంది. మాన్‌సూన్‌లో మేఘాలన్నీ మామూలుగా వర్షించినా నైసర్గిక పరిస్థితుల రీత్యా ఈ ప్రాంతాల్లో ఏడాదంతా ముసురు దుప్పటి కప్పుకొనే ఉంటుంది. నెరియమంగళం, చిన్న కల్లార్ వంటి ప్రాంతాలపై వర్షం తన ప్రేమను ఎక్కువ గా చూపిస్తుంది. ఏడాదంతా ఈ ప్రాంతాల్లో వర్షఛాయలే కనిపిస్తాయి. ఎప్పుడూ చిరు జల్లులతో తడుస్తూ పచ్చదనంతో వర్షారవిందాలను విరబూయిస్తాయి. ఎప్పుడూ తడారని ప్రాంతాలుగా పేరు తెచ్చుకున్న ఈ ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి.
నెరియమంగళం..
ఇండియా మున్నార్‌కు గేట్‌వేగా నెరియమంగళాన్ని పిలుస్తారు. కేరళలోని ఎర్నాకులంలో ఉండే ఈ ప్రాంతంలో ఆ రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కొండల పక్క నుంచి పెరియార్ నది ప్రవహిస్తుంది. దక్షిణ భారత్‌లో తొలిసారిగా ఇక్కడే ఆర్చ్ బ్రిడ్జిని కట్టారు. 1935లోనే కట్టిన ఈ వంతెన ఇప్పటికీ అక్కడి ఎత్తు ప్రాంతాలకు అనుసంధానం చేస్తుంది. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి నిర్మించిన రాణికల్లు కట్టడం కూడా ఇక్కడ ఉంది. చిన్నపాటి టౌన్ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. 16 వేలకు పైగా జనాభా ఉంటుంది. జవహర్ నవోదయ పాఠశాల కూడా ఉంది. ఇక్కడి ప్రజలు వ్యవసాయ ప్రధాన వృత్తులు చేస్తుంటారు. అక్కడి ప్రకృతికి సరితూగేలా ఉంటుంది వారి జీవనశైలి. ఇళ్లు పెద్ద పెరళ్లతో అందంగా ఉంటాయి. పలు రకాల పూలు, కూరగాయలను ఇళ్లలోనే పెంచుకుంటారు. అయితే ఎప్పుడు ముసురు పట్టినట్టు ఉండకపోవడం ఒక అనుకూలత. దట్టమైన అటవీ ప్రాంతంలోను వేరే ప్రాంతాలకు కలిపే దారులు ఉంటాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ చీయప్పర జలపాతం. ఏడు మెట్లుగా జాలువారే ఈ జలపాతం ఆకాశం నుంచి నేలకు దిగుతున్నట్టు ఉంటుంది.
మాన్‌సూన్ ట్రిప్ : వానాకాలం నేస్తం..నెరియమంగళం..
-