జెనీవా మొదటి ఒప్పందం ప్రకారం.. గాయాలతో పట్టుబడిన లేదా అనారోగ్యంతో ఉన్న సైనికులను లేదా ప్రజలను వారి రంగు, లింగం, మతం, ప్రాంతం, వర్గం.. భేదం చూడకుండా రక్షణ కల్పించాలి.
పాకిస్థాన్ ఆర్మీ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తున్న విషయం విదితమే. అయితే అభినందన్‌ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించగానే భారత్ స్పందించి జెనీవా ఒప్పందం ప్రకారం అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే భారత్‌తోపాటు ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్ అభినందన్‌ను విడుదల చేస్తోంది. అయితే ఇంతకీ.. ఈ జెనీవా ఒప్పందం అంటే ఏమిటి ? దాని వల్ల ఏం జరుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జెనీవా ఒప్పందం అంటే..?
యుద్ధంలో పట్టుబడిన ఇతర దేశాలకు చెందిన సైనికులు లేదా ప్రజలతో ఎలా వ్యవహరించాలి..? అనే అంశాలతో కూడుకున్నదే.. జెనీవా ఒప్పందం. దీన్ని మొదటగా 1929 జూలై 27న ప్రతిపాదించగా, 1931 జూన్ 19 నుంచి అమలు చేస్తున్నారు. ఆ తరువాత దీనికి కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. యుద్ధ సమయంలో గాయపడిన లేదా అనారోగ్యంతో పట్టుబడిన ఇతర దేశాలకు చెందిన సైనికులు లేదా ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో ఈ ఒప్పందంలో ఉంటుంది. ఇందులో మొత్తం 4 అంశాలు ఉంటాయి. 1949లో ఈ ఒప్పందానికి 3 సవరణలు చేసి అందుబాటులోకి తెచ్చారు.
జెనీవా ఒప్పందాలు…
జెనీవా మొదటి ఒప్పందం ప్రకారం.. గాయాలతో పట్టుబడిన లేదా అనారోగ్యంతో ఉన్న సైనికులను లేదా ప్రజలను వారి రంగు, లింగం, మతం, ప్రాంతం, వర్గం.. భేదం చూడకుండా రక్షణ కల్పించాలి. వారిని వేధించకూడదు. వారి పట్ల మానవత్వంతో ఉండాలి. ఎలాంటి విచారణ చేయకుండా యుద్ధంలో పట్టుబడిన వారిని వేధించరాదు, హింసించరాదు, ఉరి తీయరాదు. వారికి సరైన వైద్యాన్ని అందించాలి. పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. ఇక జెనీవా రెండో ఒప్పందం నౌకా దళానికి వర్తిస్తుంది. అందులోనూ పైన చెప్పిన నిబంధనలు ఉంటాయి. ఇక జెనీవా మూడో ఒప్పందం ప్రకారం… యుద్ధంలో పట్టుబడిన వ్యక్తుల పేర్లు, అధికారులు, సైనికులు అయితే వారి ర్యాంకులు, సీరియల్ నంబర్లు మాత్రమే తీసుకోవాలి. అంతేకానీ వారి దేశానికి చెందిన సమాచారం అడగరాదు. అలాగే ఆ సమాచారం కోసం పట్టుబడిన వారిని హింసించరాదు. ఇక జెనీవా నాలుగో ఒప్పందం ప్రకారం.. గాయపడిన లేదా అనారోగ్యం పాలైన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. వారికి రక్షణ కల్పించాలి. అవసరం అయితే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించాలి..!
మీకు ఈ సమాచారం నచ్చితే ఈ లింక్‌ను ఇతరులకు షేర్ చేయండి..!