దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఆ బ్యాంకు నుంచి గృహ, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి మరో 3 నెలల పాటు మారటోరియం సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. కరోనా లాక్‌డౌన్ వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్చి నుంచి మే వరకు 3 నెలల పాటు తొలి విడత మారటోరియం సదుపాయం కల్పించగా, ఇటీవలే దాన్ని మళ్లీ మరో 3 నెలలకు పెంచింది. దీంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు వినియోగదారులు మారటోరియం సదుపాయం పొందవచ్చు.
అయితే ఎస్‌బీఐ వినియోగదారులకు మారటోరియం సదుపాయం ఆటోమేటిగ్గా వర్తించనుంది. ఇందుకు వారు ఎలాంటి దరఖాస్తు పెట్టుకోవాల్సిన పనిలేదు. ఇక మరో 3 నెలలు అదనంగా మారటోరియం పెంచడంతో.. సెప్టెంబర్ నెలలో వినియోగదారులు మళ్లీ ఈఎంఐలను చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి నుంచి మళ్లీ ఈఎంఐ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఇక ఈ విషయంపై ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా స్పందించాల్సి ఉంది.
కాగా ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ బ్యాంకుకు చెందిన 85 లక్షల మంది కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది.