రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులు స్కూల్ అంతర్గత పరీక్షల్లో సాధించిన మార్కుల సగటు ఆధారంగా వారికి త్వరలోనే ఫైనల్ పరీక్షల మార్కులు వేసి అనంతరం గ్రేడింగ్ ఇస్తామని వెల్లడించింది. అయితే తమిళనాడు కూడా తెలంగాణ బాటలోనే టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి మంగళవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
తమిళనాడులో 10వ తరగతి విద్యార్థుల పరీక్షలను రద్దు చేయడంతో వారికి స్కూళ్లలో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి ఫైనల్ పరీక్షల మార్కులను వేయనున్నారు. అందుకు గాను ఆయా పరీక్షల నుంచి 80 శాతం మార్కులను ఫైనల్ పరీక్షల మార్కుల కోసం తీసుకుంటారు. ఇక మిగిలిన 20 శాతం మార్కులను విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి వేస్తారు. కాగా తమిళనాడులో మొత్తం 9 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు జూన్ 15వ తేదీ నుంచి పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక తమిళనాడులో జరగాల్సిన 11వ తరగతి పరీక్షలు, 12వ తరగతి సప్లిమెంట్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా పరీక్షలకు గాను త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.