ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ యాప్‌లో నావిగేషన్ ఫీచర్‌కు గాను ఇప్పటి వరకు విదేశీయులకు చెందిన వాయిస్‌ను వినిపించింది. యూజర్ ఎంచుకున్న వాయిస్ ప్రకారం ఆడ లేదా మగ గొంతులో నావిగేషన్ వాయిస్ వినిపిస్తుంది. అయితే ఇకపై గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌లో మనకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్ వినిపించనుంది. ఈ మేరకు గూగుల్ ఇప్పటికే ఆయనతో చర్చలు జరుపుతోంది.
కాగా మ్యాప్స్‌లోని నావిగేషన్ ఫీచర్‌కు తన గొంతును అరువిచ్చేందుకు గాను అమితాబ్‌కు గూగుల్ భారీ మొత్తంలో ముట్టజెబుతామని ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై అమితాబ్ ఇంకా స్పందించలేదు. అందుకు ఆయన ఓకే చెబితే గూగుల్ వెంటనే ఆయన వాయిస్‌ను రికార్డు చేసి దాన్ని మ్యాప్స్‌లోని నావిగేషన్‌కు ఉపయోగిస్తుంది. కాగా ఈ విషయంపై ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతుండగా.. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇక అమితాబ్ ఇప్పటికే పలుమార్లు తన గొంతును పలు వీడియోలకు వాయిస్ ఓవర్‌గా అరువిచ్చి అదుర్స్ అనిపించారు. 2005లో పెంగ్విన్స్‌పై వచ్చిన డాక్యుమెంటరీ చిత్రానికి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా ఆ చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అయితే గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌కు అమితాబ్ తన వాయిస్ ఓవర్‌ను అందిస్తారో, లేదో చూడాలి.