ప్రకాశం జిల్లా టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పి..సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గత కొన్ని నెలలుగా శిద్దా రాఘవరావు వైసీపీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాను మాత్రం ఎట్టి పతిస్థితులలో టీడీపీని వీడేది లేదని స్పష్టంగా చెప్పారు. అయినా రాజకీయ నాయకుల మాటలకి అర్ధాలే వేరు అన్నట్టు, ఇవాళ తన కుమారుడు సుధీర్ తో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరినీ పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే వైసీపీలో చేరిన అనంతరం శిద్దా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని… అవి తనను ఎంతగానో ఆకర్షించేయని, అందుకే వైసీపీలో చేరానని చెప్పారు. అలాగే భవిష్యత్తులో కూడా అమలు చేస్తారని అన్నారు. ప్రజల మనసుల్లో జగన్ చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.