దేశంలో ప్రస్తుతం అనేక మీడియా సంస్థలు దిన, వార, మాస పత్రికలను ప్రచురిస్తున్నాయి. వాటికి గాను కొన్ని కంపెనీలు ఆన్‌లైన్‌లో పాఠకుల కోసం ఈ-పేపర్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక కొన్ని సంస్థలు నామమాత్రపు రుసుముతో వాటిని చదువుకునేందుకు, డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తుండగా.. అనేక సంస్థలకు చెందిన ఈ-పేపర్లను మాత్రం ఉచితంగా చదువుకునే వీలు కల్పించారు. అయితే కొందరు ఆయా ఈ-పేపర్‌లను సంబంధిత సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసి నిత్యం తమ తమ సోషల్ అకౌంట్ల ద్వారా ఇతరులకు షేర్ చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం చట్ట విరుద్ధమే అవుతుందని.. న్యాయ నిపుణులు అంటున్నారు.
ఈ-పేపర్ పాఠకుడికి ఉచితంగా లేదా డబ్బులకు ఆన్‌లైన్‌లో లభించినా.. దాన్ని పాఠకుడు చదవాలి. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఈ-పేపర్‌ను ఇతరులకు మాత్రం షేర్ చేయకూడదు. అలా చేస్తే కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 43 ప్రకారం అలా ఒకరికి చెందిన డాక్యుమెంట్లను ఇతరులకు షేర్ చేయడం నేరమే అవుతుంది. అలాంటి డాక్యుమెంట్లను షేర్ చేసినా లేదా వాటిలో మార్పులు, చేర్పులు చేసి తిరిగి ప్రచురించినా.. నేరమే అవుతుంది. అలాంటి సందర్భాల్లో మీడియా సంస్థలు ఆయా వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించవచ్చు.
కనుక పాఠకులు ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టి లేదా ఉచితంగా.. ఎలా అయినా సరే.. తమకు ఈ-పేపర్ చదువుకునే వెసులుబాటు ఉంటే వారు చదువుకోవాలి. లేదా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అంతేకానీ.. దాన్ని ఇతరులకు సోషల్ మీడియాలోనే కాదు, ఇతర ఏ మాధ్యమం ద్వారా కూడా షేర్ చేయరాదు. అలా చేసిన వారు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు.