కరోనాను నయం చేస్తుందంటూ ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి సంస్థ కరోనైల్ పేరిట మంగళవారం ఓ ఆయుర్వేద ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న పతంజలి గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఈ మెడిసిన్‌ను ఆ సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, బాబా రాందేవ్‌లు ఆవిష్కరించారు. అయితే ఈ ఔషధం అమ్మకాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
పతంజలి సంస్థ విడుదల చేసిన కరోనైల్ ఔషధానికి సంబంధించి రీసెర్చి వివరాలను ఇంకా తమకు తెలియజేయలేదని, కనుక అప్పటి వరకు ఔషధం విక్రయాలను, దానికి సంబంధించిన ప్రచారాలను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలిని ఆదేశించింది.
అయితే దీనిపై బాబా రాందేవ్ స్పందిస్తూ.. తాము రీసెర్చి చేశాకే అన్ని రుజువులతోనే మెడిసిన్‌ను విడుదల చేశామని, తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ అడిగిన వివరాలను అందజేస్తామని, ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉంటుందని ఆయన భావించారు. ఇక ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి లభించాకే పతంజలి ఈ మెడిసిన్‌ను విక్రయించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.