ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం వెలుగు చూస్తూనే ఉంది. ఆదిలో అంతా తేలికగానే తీసుకున్నారు. ఇంకేముంది.. ఇది జ్వరం అన్నారు. అమెరికా నుంచి ఆంధ్ర వరకు ప్రతి ఒక్క నాయకుడు కూడా లైట్‌గానే భావించారు. కానీ, ఎక్కడో గత ఏడాది నవంబరులో వచ్చిన ఈ వైరస్ ఇప్పటికీ ఇంకా బలపడుతూనే ఉంది. రోజుకో రూపం సంతరించుకుని, ప్రజలను నిలువెల్లా వణికి స్తోంది. ఇప్పటి వరకు కరోనా రాకుండా జగ్రత్తలు తీసుకోవడమే తప్ప.. దీని బారిన పడినవారిని రక్షించుకునే మార్గాలు లేకుండా పోయాయి.
ఇప్పటికి అదిగో ఇదిగో వ్యాక్సిన్.. అంటూ ప్రపంచ దేశాలు ప్రజలను ఊరిస్తున్నాయి. కానీ, ఇప్పట్లో వ్యాక్సి న్ వచ్చే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదని అంటున్నారు ఐక్యరాజ్యసమితి డబ్ల్యూ హెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ పేర్కొన్నారు. అంతేకాదు, కరోనా వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించేందుకు తమ బృందాన్ని చైనాకి పంపనున్నట్టు ఆయన తెలిపారు. నిత్యం తన రూపాన్ని మార్చుకుంటూ.. రోజు రోజుకు బలోపేతం అవుతున్న వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పుడు జరుగుతున్న ప్రయోగాలు అంతగా ఫలితాన్ని ఇచ్చేలా లేవని అంటున్నారు.
చైనాలోని వుహాన్ కేంద్రంగా ఆరు నెలల క్రితం వెలుగుచూసిన ఈ మహమ్మారి ఇప్పటికే 5 లక్షల మందిని బలితీసుకుందనీ.. పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరుతోందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముందు ముందు మరింత విజృంభించే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఈ పరిస్థితి మారాలని కోరుకుంటున్నాం. మళ్లీ మన జీవితాలు సాధారణ స్థితికి రావాలి. అయితే చేదు నిజం ఏమిటంటే.. ఇది అంత త్వరగా ముగిసేది కాదు. కొన్ని దేశాలు వైరస్‌ను నిలువరించగలిగినా.. ప్రపంచ వ్యాప్తంగా ఇది మరింత వేగం పుంజుకుంటోంది..’’ అని గేబ్రేయేసస్ పేర్కొన్నారు. సో.. దీనిని బట్టి ఏం చేయాలనేది మన చేతుల్లోనే ఉంది!!