ప్రముఖ సోషల్ మీడియా అయిన ట్విట్టర్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది ఇప్పుడు. మొన్నటికి కొన్ని ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్స్ కొన్ని హ్యాక్ అయిన విషయం సంచలనం అయింది. అయితే దీనికి మన భారత ప్రభుత్వం స్పందించి ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హ్యాక్‌కు గురైన ఖాతాలలో భారతీయులు ఎవరెవరు ఉన్నారో తెలపాలని కేంద్రం ప్రభుత్వం ప్రశ్నించింది. దీనిపై సాధ్యమైనంత తొందరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు శనివారం జారీచేసిన నోటీసులో పేర్కొంది. సైబర్ నేరగాళ్లు ఈ మధ్య మరి రెచ్చిపోతున్నారు ఏకంగా రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తో పాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారికి తెలియకుండానే వారి ట్విట్టర్ ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్ట్ చూసి వెంటనే అప్రమత్తం అయ్యారు. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి.