ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. తమ దేశంలో ఒక్క కొవిడ్-19 కేసు నమోదు కాలేదని ప్రకటిస్తూ వస్తోన్న ఉత్తరకొరియాలో తొలి కరోనా అనుమానాస్పద కేసు నమోదైంది. కైసోంగ్ నగరంలోని ఓ వ్యక్తి.. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నాడని ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఘటనతో కైసోంగ్ నగరంలో లాక్‌డౌన్ విధించారు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్. దేశంలోకి వైరస్ వస్తే క్లిష్టమైన పరిస్థితులు తలెత్తుతాయని వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర పరిస్థితి విధించారు.
చాలా ఏళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి.. సరిహద్దును అక్రమంగా దాటి మళ్లీ వచ్చాడని.. అతడికి వైరస్ లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు అధికారులు. ఈ వ్యక్తికి కరోనా నిర్ధరణ అయితే… ఉత్తర కొరియాలో అధికారికంగా తొలి కరోనా కేసు నమోదవుతుంది. తమ దేశ భూభాగంలో ఇంతవరకూ ఒక్క కొవిడ్ కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా వాదిస్తున్నా.. నిపుణులు ఖండిస్తున్నారు. ఉత్తరకొరియాలో కరోనా కేసులు నమోదవుతున్నా.. బయటకు రానివ్వడం లేదని చెబుతున్నారు.