చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా యాంటీ చైనా సెంటిమెంట్ నడుస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్స్‌ను మన దగ్గర నిషేధించారు. దీనికి తోడు యాంటీ చైనా సెంటిమెంట్ రోజు రోజుకీ బలపడుతోంది. దీంతో చైనా ఫోన్లను వాడేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. చైనా కంపెనీలకు చెందిన ఫోన్లను పలువురు కొంటున్నా.. గత కొద్ది నెలలుగా చూస్తే మాత్రం ఆ దేశ ఫోన్ల అమ్మకాలు పడిపోయానని స్పష్టమవుతోంది. అదే సమయంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
జనవరి – మార్చి నెలల్లో మన దేశంలో చైనా ఫోన్ల మార్కెట్ వాటా 81 శాతంగా ఉండగా.. అది ఏప్రిల్ – జూన్ వరకు 72 శాతానికి పడిపోయింది. ఇక మార్చితో ముగిసిన త్రైమాసికంలో షియోమీ 30 శాతం వాటాతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మొదటి స్థానంలో ఉండగా 17 శాతం వాటాతో వివో రెండో స్థానంలో నిలిచింది. 16 శాతం వాటాతో శాంసంగ్ మూడో స్థానంలో నిలిచింది. కానీ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి శాంసంగ్ బాగా పుంజుకుంది. ఆ కంపెనీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 26 శాతం వాటాతో రెండో స్థానంలోకి దూసుకువచ్చింది. మరోవైపు జూన్ త్రైమాసికానికి షియోమీ 29 శాతం వాటాతో సరిపెట్టుకుంది. అంటే 3 నెలల్లోనే షియోమీ వాటా 1 శాతం తగ్గింది. శాంసంగ్ ఇంకా బాగా పుంజుకుంటే భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. శాంసంగ్‌కు, షియోమీకి ఇంకా కేవలం 3 శాతం మాత్రమే తేడా ఉంది. ముందు ముందు యాంటీ చైనా సెంటిమెంట్ ఇలాగే కొనసాగితే షియోమీతోపాటు ఇతర చైనా కంపెనీలకు గడ్డు కాలమే ఎదురవుతుందని చెప్పవచ్చు.
కాగా రూ.30వేలు అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ఫోన్ల మార్కెట్లో వన్‌ప్లస్ మొదటి స్థానంలో ఉంది. రూ.45వేలు అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ఫోన్ల మార్కెట్లో ఆపిల్ అగ్రస్థానంలో ఉంది. అలాగే ఫీచర్ ఫోన్స్ విభాగంలో 24 శాతం వాటాతో ఐటెల్ ప్రథమ స్థానంలో ఉండగా, 23 శాతం వాటాతో లావా రెండో స్థానంలో, 22 శాతంతో శాంసంగ్ 3వ స్థానంలో, 9 శాతంతో నోకియా 4వ స్థానంలో, 5 శాతం వాటాతో కార్బన్ 5వ స్థానంలో నిలిచాయి.