ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కస్టమర్ ఆర్డర్ చేసే వస్తువులను కేవలం 90 నిమిషాల్లోనే డెలివరీ పొందవచ్చు. ఇందుకు గాను ఆ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ క్విక్ అనే సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా కస్టమర్లు తమ వస్తువులను ఆర్డర్ చేశాక కేవలం 90 నిమిషాల్లోనే అవి వారి ఇళ్లకు వస్తాయి. లేదా ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఏదైనా ఒక నిర్దిష్టమైన 2 అవర్ గ్యాప్‌లో సదరు వస్తువులు డెలివరీ అయ్యేలా కూడా కస్టమర్లు ఆప్షన్‌ను సెట్ చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ క్విక్ సేవలను కేవలం బెంగళూరులోని పలు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అందిస్తున్నారు. అక్కడి వైట్ ఫీల్డ్, పనథుర్, హెచ్ఎస్ఆర్ లే అవుట్, బీటీఎం లే అవుట్, బాణశంకరి, కేఆర్ పురం, ఇందిరానగర్లలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఈ సేవలను పొందవచ్చు. అతి త్వరలోనే దేశంలోని పలు ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఈ సేవలను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తేనుంది.
కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ క్విక్ ద్వారా కిరాణా సరుకులు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు, స్టేషనరీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కు చెందిన పిన్‌కోడ్ కాకుండా వారు నివాసం ఉండే ప్రాంతానికి చెందిన అక్షాంశ, రేఖాంశాలను సేకరిస్తుంది. ఈ క్రమంలో కచ్చితమైన అడ్రస్‌కు వారు వస్తువులను డెలివరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక కరోనా నేపథ్యంలో కస్టమర్లకు వేగంగా వస్తువులను డెలివరీ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సేవలను ప్రారంభించామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.