అవును.. ఆ గ్రామంలో నలుగురే ఓటర్లున్నారు. ఆ నలుగురు ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ప్రత్యకంగా బూత్ ను కూడా ఏర్పాటు చేస్తున్నది. నలుగురు ఓటర్లే కదా అని లైట్ తీసుకోలేదు. వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలన్న లక్ష్యంతో ఈసీ పనిచేస్తున్నది. దానిలో భాగంగానే ఓటర్లు ఎంతమంది ఉన్నా.. రవాణాకు దూరంగా ఉన్న ఊళ్లయినా.. అడవయినా ఎక్కడైనా.. పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తున్నారు.
నవంబర్ 12న ఛత్తీస్ గఢ్ లో తొలి దశ పోలింగ్ జరగనుంది తెలుసు కదా. దాని కోసమని… భరత్ పూర్ – సోన్ హట్ నియోజకవర్గంలోని షిరందఢ్ గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్నది కేవలం నలుగురే ఓటర్లు. వాళ్లలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారట. అయితే.. షిరందఢ్ అనే గ్రామం అడవిలో ఉంటుందట. అక్కడికి వెళ్లడానికి ఎటువంటి రవాణా సౌకర్యం ఉండదట. అయినా.. పోలింగ్ కు ముందు రోజు ఆ ఊరికి వెళ్లి పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.