దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ.. భారతీయ సినిమాకు సుశాంత్ సింగ్ చేసిన కృషిని గుర్తిస్తూ.. కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీలో అతడికి గౌరవ సత్కారం లభించింది. అమెరికాలో నివాసముంటున్న సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తికి అతని తరఫున ఈ సర్టిఫికేట్‌ను అందజేశారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమాల్లో నటించాలనేది తన చిరకాల కోరికగా సుశాంత్ తరచూ చెబుతుండేవాడని శ్వేత తెలిపింది.
మరోవైపు శ్వేత భర్త విశాల్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుశాంత్‌కు ఈ గౌరవాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సుశాంత్ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమెరికాలోని భారతీయులు నిత్యం గమనిస్తున్నారని అన్నారు.ప్రస్తుతం సుశాంత్ కేసు విచారణలో భాగంగా ఈడీ, సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు కేసుతో సంబంధమున్న పలువురిని ఈడీ అధికారులు విచారించారు.