కరోనా లాక్డౌన్ వల్ల ఈ మధ్య కాలం వరకు జనాలు తమకు ఉన్న ఇతర అనారోగ్య సమస్యలకు హాస్పిటళ్లకు వెళ్లలేకపోయారు. మరోవైపు వర్షాకాలం సీజన్ జోరు మీదుంది. దీంతో సీజనల్ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు హాస్పిటళ్లకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ప్రభుత్వ హాస్పిటళ్ల వద్ద ఎక్కడ చూసినా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జనాలు సోషల్ డిస్టన్స్ పాటించడకుండా హాస్పిటళ్ల వద్ద కిలోమీటర్ల మేర వైద్యం కోసం బారులు తీరుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్లో ఔట్ పేషెంట్ విభాగం వద్ద గురువారం పెద్ద ఎత్తున పేషెంట్లు వైద్యం కోసం బారులు తీరారు. కిలోమీటర్ల మేర లైన్లో నిలబడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి వారందరూ కరోనా బాధితులు కారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు. తమ సమస్యలకు వైద్యం చేయించుకునేందుకు అక్కడికి వచ్చారు. దీంతో హాస్పిటల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మరోవైపు పేషెంట్లను పట్టించుకునేవారు లేకపోవడంతో అక్కడ కోవిడ్ రూల్స్‌ను ఎవరూ పాటించడం లేదు. సోషల్ డిస్టన్స్ అనేది లేకుండా పోయింది. దీంతో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే నిజానికి దేశవ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కరోనా లాక్డౌన్ కారణంగా చాలా రోజుల పాటు అనేక మంది తమ అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించుకోలేదు. వారితోపాటు సీజనల్ వ్యాధులు వస్తున్నవారు కూడా హాస్పిటళ్లకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పేషెంట్లతో హాస్పిటళ్లన్నీ రద్దీగా మారాయి. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ అంశం కలకలం రేపుతోంది. మరి ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించి కోవిడ్ కాకుండా ఇతర సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకంగా వేరే హాస్పిటళ్లలో చికిత్సను అందిస్తాయో, లేదో చూడాలి.