జగన్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా గండి కోట నిర్వాసితులకు పరిహారం అందించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గండి కోట ప్రాజెక్ట్ లో 12 టీఎంసీలు నిల్వచేసి, 19న్నర టీఎంసీల వరకు రైతులకు అందించిందని అన్నారు. ఆనాడు నీటిని నిల్వచేయకుండా ఉండటంకోసం, జగన్ నిర్వాసితులను రెచ్చగొట్టాడని అధికారంలోకి వచ్చాక రూ.2లక్షలకోట్లు ఖర్చుచేసిన జగన్, గండికోట నిర్వాసితులకు డబ్బులెందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. 15 నెలల్లో కమీషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం సహా, అన్ని సాగు నీటి ప్రాజెక్టులను పండ బెట్టారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిందో, వాటి నిర్మాణానికి ఎంత ఖర్చు చేసిందో చెప్పగలరా ? అని ఆయన ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లివ్వాల్సి వస్తుందని, రాయలసీమకు నీళ్ళు ఆపేస్తారా? అని ఉమా ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడి, కేవలం అప్పుల కోసం రైతుల మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. రైతాంగం ఇబ్బందులలో ఉంటే, వారికి రుణాలు అందకుండా చేసి, సున్నా వడ్డీ పథకంలో వారికి సున్నా చుట్టారని అన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని అంగుళం కూడా కదల్చ లేరని ఆయన అన్నారు. ప్రజల తరుపున బాధ్యత గల వారిగా ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక లారీలతో తొక్కిస్తామని బెదిరిస్తారా? అని ఉమా ప్రశ్నించారు.