కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో 2021 మార్చి నెల నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియాలో నెటిజన్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదని, 2021 మొదటి త్రైమాసికం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి, అత్యవసర సేవలు అందించే వారికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని తెలిపారు. అత్యవసర సేవలు అందించేవారితోపాటు వృద్ధులు, పిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముందుగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ సేఫ్టీ, ఖరీదు, సప్లై చెయిన్ వంటి అంశాలను కేంద్రం ముందుగా పరిశీలించి అంచనా వేస్తుందని, అందుకు అనుగుణంగా దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్ అని నిరూపించేందుకు అవసరం అయితే తాను ముందుగా వ్యాక్సిన్ తీసుకుంటానని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం 3 వ్యాక్సిన్లు ఫేజ్ 2, 3 ట్రయల్స్‌లో ఉన్నాయని, వాటిలో ఏది ముందుగా అందుబాటులోకి వస్తుందో చెప్పలేమని అన్నారు. ఏ వ్యాక్సిన్ వచ్చినా సరే.. ప్రజలందరికీ పంపిణీ చేస్తామన్నారు.