ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ కొత్తగా వీడియో కేవైసీ ఫెసిలిటీని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్లను ఓపెన్ చేయడం, పర్సనల్ లోన్లను తీసుకోవడం చాలా సులభతరమవుతుంది. కస్టమర్లు బ్యాంకుల వద్దకు వెళ్లకుండా, బ్యాంకుల ప్రతినిధులు కస్టమర్ల ఇండ్లకు వెళ్లకుండా.. పూర్తిగానే ఆన్‌లైన్‌లోనే, కాంటాక్ట్ లెస్ పద్ధతిలో డిజిటల్ రూపంలో కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
కస్టమర్ ముందుగా తన ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌గా ఉండాలి. కస్టమర్ ఇండియాలోనే ఉండాలి. అలాగే తన ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డులను దగ్గర ఉంచుకోవాలి. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వీడియో కాల్ ద్వారా కస్టమర్ కేవైసీ వివరాలను తీసుకుంటాడు. ఈ క్రమంలో కస్టమర్‌కు చెందిన ఫొటోలను, వీడియోను వారు సేకరిస్తారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వీడియో కేవైసీ కూడా అసలు కేవైసీ కిందకు వస్తుంది. కనుక వీడియో కేవైసీ పూర్తయ్యాక కస్టమర్లకు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి లభిస్తుంది.
కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం సేవింగ్స్, శాలరీ అకౌంట్లు, కార్పొరేట్ అకౌంట్లు కలిగి ఉన్నవారికి, పర్సనల్ లోన్లను తీసుకునే వారికి మాత్రమే వీడియో కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఇతర కస్టమర్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.